Begin typing your search above and press return to search.

ఆ టీవీలు...పేపర్లు చూడొద్దు...జగన్ మార్క్ నిషేధమా...?

By:  Tupaki Desk   |   20 Oct 2022 12:30 PM GMT
ఆ టీవీలు...పేపర్లు చూడొద్దు...జగన్ మార్క్ నిషేధమా...?
X
ప్రజాస్వామ్యంలో దేనికీ నిషేధం అన్నదే ఉండదు. ఒకరికి చెడు అనిపించినది మరొకరికి మంచిగా తోస్తుంది. ఎవరి వివేచనకు ఆయా విషయాలను వదిలిపెట్టడమే ప్రజాస్వామ్య స్పూర్తి. భావ ప్రకటన అందరికీ ఉంటుంది. ఎవరికి వారు తోచిన విధంగా వారు దానికి నిర్వచనం చెప్పుకుంటారు. ఇక మీడియా విషయానికి వస్తే నిజానికి అది నిష్పక్షపాతంగానే ఉండాలి. కానీ అన్ని వ్యవస్థలతో పాటు దానికి కూడా చెద ఏనాడో అంటుకుంది. అది ఈనాటిది కాదు, ఎప్పటికీ పోదు కూడా. అంతమాత్రం చేత మొత్తం మీడియానే ఎవరూ నిందించలేరు.

ఏకంగా నిషేధించనూ లేరు. ఏపీలో అయితే తెలుగు నాట రాజకీయ పోరాటంలో మీడియా ఆరాటం కూడా హెచ్చుగానే ఉంది. ఇది అందరికీ తెల్సిందే. ఇక అధికార వైసీపీకి కూడా సొంతంగానే మీడియా హౌజ్ ఉంది కదా. అలాగే విపక్షాలకు వత్తాసుగా టీవీలు పేపర్లు కొన్ని ఉన్నాయి. ముందే చెప్పుకున్నట్లుగా ఇది దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధం. ఈ విషయంలో ఇపుడు అర్జంటుగా ఒకరి మీదనే నిందలెసి ఒక సెక్షన్ దే తప్పు అని చూడవద్దు అంటే కుదిరే పనేనా. అది భావ్యమేనా. అసలు అలాంటి నిషేధాలు ప్రజాస్వామ్యంలో ఉంటాయా.

కానీ సీఎం జగన్ మాత్రం అవనిగడ్డ సభలో మాట్లాడుతూ టీడీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్న టీవీలను, పేపర్లను చూడొద్దని సందేశం ఇచ్చారు. మంచిగా వారు ఏదీ చూసి చెప్పడం లేదుట. అందుకే వారు చెప్పేదంతా అబద్ధమని చూడవద్దని జగన్ కోరడమే విశేషం, విడ్డూరం. ఆ మాటకు వస్తే జనాలకు ఏ పేపరు రాజకీయ రంగు ఏమిటో తెలియదా. అలాగే ఏ పత్రిక వెనక ఏ రాజకీయ పార్టీ ఆకాంక్షలు ఉన్నాయో కూడా అర్ధం చేసుకోలేని అమాయకులా జనం.

అందువల్ల ఆ పేపర్లు చూడవద్దు చదవవద్దు అని సీఎం స్థాయిలోని వ్యక్తి చెప్పడం ఎందుకు అన్నదే ప్రశ్న. ఈ రోజు జగన్ పవర్ లో ఉన్నారు. రేపటి రోజున మరో నాయకుడు అధికారంలోకి వచ్చి జగన్ సొంత మీడియా నుంచి వచ్చే పేపర్, టీవీలను చూడవద్దు అంటే అపుడు సంగతేంటి. అందువల్ల ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో అసలు కుదిరేవి కావు. ఈ విషయం పెద్దలుగా రాష్ట్ర అధినేతలుగా ఎవరైనా గుర్తించాల్సి ఉంటుంది. ప్రజలకు ఈ రకమైన సందేశాలను కూడా ఇవ్వడం కూడా తగని పని అంటున్నారు.

తనకు చంద్రబాబు మాదిరిగా కొన్ని చానళ్ళు, పేపర్ల అండ లేదని జగన్ బాధపడుతున్నారు. కానీ ఆయన చేతిలో కూడా కొంత మీడియా ఉంది కదా. అయినా మీడియాను చూసి ఓట్లేసే రోజులా ఇవి అన్నది కూడా కీలక ప్రశ్న కదా. అందువల్ల ప్రజలను వారి ఆలోచనల మేరకు వదిలేయడమే మంచిది. వారికి ఏమీ తెలియదు అన్నట్లుగా నాయకులు ఇది చూడవద్దు, ఇది చేయవద్దు అని చెప్పడమే తప్పు అన్నది ప్రజాస్వామ్య ప్రియుల భావన.

ఇక తన పధకాలు అందరికీ అందుతున్నాయని, ప్రతీ ఇంట్లో తాను చేసిన మంచి ఉందని జగన్ భావిస్తున్నపుడు పేపర్లలో ఎవరు ఏమి రాస్తే తనకు ఇబ్బంది ఏంటి అన్న ప్రశ్న కూడా ముందుకువస్తోంది. మీ ఇంట్లో జరిగే మంచినే కొలమానంగా తీసుకుని నాకు ఓటేయండి అని పిలుపు ఇచ్చిన జగన్ కొన్ని పేపర్లను చదవద్దు అని అనడం మాత్రం బాగాలేదు అని అంటున్నారు.

మరో వైపు పవన్ మూడు పెళ్ళిళ్ల మీద జగన్ మరోసారి కామెంట్స్ చేశారు. ఈసారి ఆయన వివాహ వ్యవస్థకు సంప్రదాయాలు ఆడబిడ్డల గురించి దీనికి ముడిపెడుతూ ఈ కామెంట్స్ చేయడం విశేషం. ఇలా మూడేసి నాలుగేసి పెళ్ళిళ్ళు చేసుకుంటే వ్యవస్థ ఏమైపోతుంది అంటూ ఆయన మహిళా కోణం నుంచి ప్రశ్నలు సంధించారు. అయినా పవన్ కూడా పదే పదే మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడమే తప్పు అనుకుంటే దాన్ని మరింతగా సాగదీయం సీఎం స్థానంలో ఉన్న వారికి తగునా అన్నదే ప్రశ్న. ఇప్పటికైనా వ్యక్తిగత విషయాల మీద విమర్శలు పక్కన పెట్టి ప్రజా క్షేమం గురించి ఆలోచన చేయాలని అంతా కోరుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.