Begin typing your search above and press return to search.

మోడీ జగన్ బంధం : దోస్తీ తప్ప కుస్తీ ఎక్కడ ...?

By:  Tupaki Desk   |   27 July 2022 9:49 AM GMT
మోడీ జగన్ బంధం : దోస్తీ తప్ప కుస్తీ ఎక్కడ ...?
X
కేంద్రంలో కుస్తీ చేస్తున్నామని తాజాగా అల్లూరి జిల్లాలో వరద ప్రాంతాలలో పర్యటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. జగన్ చేసిన ఈ కామెంట్స్ ఇపుడు బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో నిధుల కోసం కేంద్రంతో తమ ప్రభుత్వం ఒక వైపు యుద్ధం చేస్తోందని మరో వైపు విన్నపాలు చేస్తోందని ఆయన పోలవరం ప్రాంతాల బాధిత జనాలతో చెప్పారు. అయితే దీని మీద విమర్శలు వస్తున్నాయి.

పోలవరం విషయంలో కేంద్రంతో కుస్తీ ఎందుకు చేయాలన్నది కూడా జనం నుంచి వస్తున్న సూటి ప్రశ్న. విభజన చట్టంలోనే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా పెట్టారు. దానిని పూర్తి చేయడం అంటే మొత్తానికి మొత్తం డ్యామ్ కట్టడం కాదు, పునరావాస ప్యాకేజి కూడా పూర్తిగా ఇవ్వడం. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం చూస్తే పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి సవరించిన అంచనాలు తీసుకుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు పునరావాసం కింద ఖర్చు చేయాలి.

ఇది కూడా ప్రాజెక్ట్ లో ఉన్న వ్యయమే. ఇక కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్వహణకు తీసుకోవడం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. నాడు చంద్రబాబు పోలవరం తొందరగా పూర్తి చేస్తామని తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. అపుడు విపక్ష నేతగా ఉన్న జగన్ కూడా కేంద్రానికి వదిలేయాల్సిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్రం ఎందుకు జోక్యం చేసుకుంటోందని అన్నారు.

ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా మేఘా సంస్థకు కాంట్రాక్టును ఇచ్చి పోలవరం పనులు చేయిస్తోంది. మరి జగన్ ఇది జాతీయ ప్రాజెక్ట్ మీరే పూర్తి చేయాలని కేంద్రానికి ఎందుకు వదిలేయడం లేదు అని ప్రశ్నలు ఎటూ ఉన్నాయి. మరో వైపు చూస్తే కేంద్రం ఇప్పటిదాకా పోలవరం కోసం 11 వేల కోట్లను మాత్రమే ఇచ్చేసి ఊరుకుంది. సవరించిన అంచనాలు చూస్తే 56 వేల కోట్ల దాకా ఉన్నాయి.

ఇంకో వైపు పునరావాస ప్యాకేజికే 20 వేల కోట్లు పూర్తిగా ఖర్చు అవుతాయి. పోలవరం డ్యామ్ కట్టడం కాదు, అందులో నీళ్ళు నింపాలీ అంటే కచ్చితంగా చుట్టుపక్కల గ్రామాల వారిని ఖాళీ చేయించాలి. వారికోసం వేరే చోట ఇళ్ళు కట్టించాలి. వారికి నష్టపరిహారం చెల్లించాలి. మరి ఇదంతా వేల కోట్ల ఖర్చు. ఆ విషయంలో ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లిస్తామని ఒప్పుకోవడంలేదు. అంతదాకా ఎందుకు కేవలం 20 వేల కోట్ల వరకూ మాత్రమే కేంద్రం పూచీ పడుతోంది. అంటే మిగిలిన 36 వేల కోట్ల ఖర్చు ఎవరు పెట్టుకుంటారు అన్నది తెలియదు.

ఈ విషయంలో జగన్ కేంద్రంతో కుస్తీ చేస్తున్నామని చెబుతున్నారు. కానీ జగన్ కేంద్రానికి మద్దతుగా ఉన్నారని అందరికీ ఎరుకైన విషయమే. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లునకూ ఆయన మద్దతు ఇస్తున్నారు. అదే విధంగా ఆయన మూడేళ్లుగా దోస్తీ బాటలోనే ఉన్నారని అంటున్నారు. మరి కుస్తీ చేస్తున్నామని ఆయన చెప్పడాన్ని అంతా విమర్శిస్తున్నారు. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ విషయంలో కూడా కుస్తీ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది అన్నది మరో లాజిక్ పాయింట్.

ఇంతలా కేంద్రం మీద యుద్ధం చేస్తే ఈ పాటికి పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం లభించేది కదా అన్న మాట కూడా ఉంది. ఏమైనా కేంద్రం మీద యుద్ధం కుస్తీ అన్న కొత్త మాటలను జగన్ ఫస్ట్ టైమ్ వాడుతున్నారు. మరి నిజంగా బీజేపీ మీద వైసీపీ మారిన వైఖరికి ఇది నిదర్శనమా లేక జనాలకు చెప్పడానికే ఈ మాటలు వాడారా అన్నది చూడాలి