Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ డేర్‌!... నోటిఫికేష‌న్ మ‌రుక్ష‌ణ‌మే జాబితా!

By:  Tupaki Desk   |   28 Feb 2019 6:13 PM GMT
జ‌గ‌న్ డేర్‌!... నోటిఫికేష‌న్ మ‌రుక్ష‌ణ‌మే జాబితా!
X
త్వ‌ర‌లో ఏపీ అసెంబ్లీతో పాటు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు విప‌క్ష వైసీపీ దాదాపుగా సిద్ధ‌మైపోయింది. ఇప్ప‌టికే అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... పార్టీకి చెందిన పార్ల‌మెంటు, అసెంబ్లీ, జిల్లాల క‌న్వీన‌ర్ల‌తో లోట‌స్ పాండ్‌లో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నిక‌ల‌కు స‌మీపిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో అవ‌లంబించాల్సిన వ్యూహంపై ఆయ‌న పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. ఎన్నిక‌ల‌కు కేవ‌లం 45 రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంద‌ని, ఈ కీల‌క స‌మయాన్ని సద్వినియోగం చేసుకోవ‌డం ద్వారా.. పార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చే దిశ‌గా ప‌కడ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇదంతా పార్టీ శ్రేణుల‌కు ఓ పార్టీ అధినేత‌గా ఇచ్చే సాధార‌ణ సందేశ‌మే అయినా... ఈ స‌మావేశంలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించారు.

ఎన్నిక‌ల‌కు పూర్తిగా స‌ర్వ‌స‌న్న‌ద్ధంగానే ఉన్నామ‌ని పరోక్షంగా చెప్పిన జ‌గ‌న్‌... ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన మ‌రుక్ష‌ణ‌మే త‌మ పార్టీ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. నోటిఫికేష‌న్ వ‌చ్చిన వెంట‌నే ఒక‌టి, రెండు రోజుల్లోనే అభ్యర్థుల జాబితాను వెల్ల‌డిస్తామ‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న తాను చేప‌ట్ట‌బోయే మ‌రో కీల‌క ఘ‌ట్టాన్ని కూడా ప్ర‌స్తావించారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన వెంట‌నే తాను బ‌స్సు యాత్రను ప్రారంభించ‌నున్న‌ట్లుగా జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట రాష్ట్రంలో 3,600 కిలో మీట‌ర్ల‌కు పైగా సుదీర్ఘ పాద‌యాత్రను చేప‌ట్టిన జ‌గ‌న్.. రాష్ట్రాన్ని చుట్టేశార‌నే చెప్పాలి.

త‌న పాద‌యాత్ర‌లో క‌వ‌ర్ కాని నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఓ సారి ట‌చ్ చేసేందుకు జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌ను చేప‌డ‌తార‌ని ఇప్ప‌టికే ఆ పార్టీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఇప్పుడు జ‌గ‌న్ త‌న బ‌స్సు యాత్ర‌ను ప్ర‌క‌టించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే తాను బ‌స్సు యాత్ర చేప‌డ‌తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌... స‌మ‌ర్ధ‌త ఉన్న వారికే ఎన్నిక‌ల ఇంచార్జులుగా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తాన‌ని కూడా ప్ర‌క‌టించారు. రానున్న 45 రోజులే కీల‌క‌మ‌ని, ఈ స‌మ‌యంలో క‌లిసివ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకుని పోవాల‌ని ఆయ‌న పార్టీ శ్రేణుల‌కు సూచించారు. మొత్తంగా కీల‌కంగా భావిస్తున్న 2019 ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌గ‌న్ త‌న స‌ర్వ‌స‌న్న‌ద్ధ‌త‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటుగా పార్టీ శ్రేణుల‌కు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌ను అందించార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.