Begin typing your search above and press return to search.

ఐకానిక్ బ్రిడ్జిని విరమించుకున్న ఏపీ సర్కారు!

By:  Tupaki Desk   |   27 Aug 2019 4:02 PM GMT
ఐకానిక్ బ్రిడ్జిని విరమించుకున్న ఏపీ సర్కారు!
X
విజయవాడ శివారులో పవిత్ర సంగమం నుంచి అమరావతిని అనుసంధానిస్తూ భారీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఏపీ స‌ర్కారు ఉప సంహరించుకుంటున్నట్లు సమాచారం. ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో శంకుస్థాప‌న చేశారు. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జిని అమరావతి అభివృద్ధి కార్పోరేషన్ చేపడుతోంది. 125 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ ఐకానిక్ వంతెనలో ఇరువైపులా 2.5 మీటర్ల ఫుట్ పాత్‌ ను కూడా నిర్మిస్తున్నారు. ఈ వంతెన కోసం 1387 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే, నిధుల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కు తగ్గ‌డంతో రాష్ట్రం సైతం అంత ఖరీదైన బ్రిడ్జి ఎందుకు... సాధారణ బ్రిడ్జి నిర్మించడం ద్వారా ఖజానా మీద భారం తగ్గించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో హైదరాబాద్ - జగదల్ పూర్‌ లకు వెళ్లే మార్గం 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దాదాపు రెండు గంటల సమయం ఆదా అవుతుంది. అటు విజయవాడ ట్రాఫిక్ భారం కూడా ఈ వంతెన కారణంగా తగ్గనుంది. బ్రిడ్జి కోసం నిర్మిస్తున్న పిల్లర్లు కూచి పూడి నృత్య భంగిమలో ఉంటాయని - ఆంధ్రప్రదేశ్ రాజధాని ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసే దిశగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం ఉంటుందని అప్ప‌టి ప్రభుత్వం తెలిపింది. ఎల్ అండ్ టీ కంపెనీ ఈ బ్రిడ్జిని రెండేళ్లలో పూర్తి చేయాలని భావించింది. ఆరు లేన్లుగా నిర్మించనున్నఈ వంతెనపై దేశంలోనే అత్యంత ఎత్తైన పైలాన్ కూడా నిర్మిస్తారు. పైలాన్ ఎత్తును 170 మీటర్లుగా నిర్థారించారు. ఈ వంతెన నిర్మాణం కోసం కృష్ణా నదిలో దాదాపు 36 పిల్లర్లను వేసేందుకు ప్ర‌తిపాదించారు.

బ్రిడ్జ్ నిర్మాణం కోసం డీపీఆర్ సైతం నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ త్వ‌ర‌లో పూర్తి చేయ‌నుంది. అయితే, ఈ స‌మ‌యంలో కేంద్రం నిధుల విష‌యంలో అభ్యంత‌రం పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ వంతెన విష‌యంలో అధిక మొత్తంలో నిధులు ఖ‌ర్చు చేసే ప్ర‌క్రియ ఇమిడి ఉంద‌ని - కేవ‌లం 400 కోట్ల‌తో బ్రిడ్జీని పూర్తి చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా సాధార‌ణ బ్రిడ్జీని నిర్మాణం చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఏపీ సర్కారు కూడా అదే బాటలో నడుస్తోంది.