Begin typing your search above and press return to search.

బాబు స‌ర్కారు ఒప్పందాల‌పై సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   26 Jun 2019 10:37 AM GMT
బాబు స‌ర్కారు ఒప్పందాల‌పై సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం
X
వ‌రుస పెట్టి నిర్ణ‌యాలు తీసుకుంటూ దూకుడుగా పాల‌నా ర‌థాన్ని ప‌రుగులు పెట్టిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు.. ఒప్పందాల మీద సునిశితంగా దృష్టి సారించిన ఆయ‌న‌.. రాష్ట్ర ఖ‌జానాకు న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉన్న ప్ర‌తి అంశం మీదా దృష్టి సారిస్తున్నారు. బాబు స‌ర్కారులో దొర్లిన అవినీతి అక్ర‌మాల‌ను వెలికి తీసేందుకు వీలుగా కేబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

30 అంశాల మీద విచార‌ణ చేయిస్తామ‌ని అవ‌స‌ర‌మైతే సీఐడీ.. సీబీఐ.. విజిలెన్స్.. ఈడీ.. త‌దిత‌ర సంస్థ‌ల సాయం తీసుకుంటామ‌న్నారు. ఈ రోజు విద్యుత్ రంగ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ‌త ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌పై ఆయ‌న విస్మ‌యాన్ని వ్య‌క్తం చేశారు. ఓప‌క్క ప‌లు ప్రైవేటు సంస్థ‌లు త‌క్కువ ధ‌ర‌కు విద్యుత్ అమ్ముతున్నా.. వాటిని వ‌దిలేసి ఎక్కువ ధ‌ర కోట్ చేసిన కంపెనీల‌తో ఒప్పందం చేసుకోవ‌టం ఏమిట‌న్న ఆయ‌న‌.. కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్ల క‌న్నా అధిక రేట్ల‌కు విద్యుత్ ను ఎందుకు కొనాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు.

అధిక ధ‌ర‌కు విద్యుత్ ను కొనుగోలు చేయ‌టం కారణంగా ఖ‌జానాకు రూ.2636 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని.. ఆ న‌ష్టాన్ని రిక‌వ‌రీ చేయాల‌ని సీఎం ఆదేశించ‌టం గ‌మ‌నార్హం. గ‌త ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల్ని మ‌రోసారి స‌మీక్షించాల‌ని.. వారితో మ‌రోసారి మాట్లాడి.. ధ‌ర త‌గ్గింపు దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

సోలార్.. విండ్ కంపెనీల‌తో జ‌రిగిన ఒప్పందాల్లో భారీ దోపిడీ జ‌రిగిన‌ట్లుగా త‌మ‌కు అర్థ‌మైంద‌న్న జ‌గ‌న్‌.. ఈ వ్య‌వ‌హారంలో ఎంతటివారున్నా వ‌దిలేది లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఖ‌జానాకు న‌ష్టం వాటిల్లేలా చేసిన వారిలో ఎంత పెద్ద అధికారులు.. మంత్రి..ముఖ్య‌మంత్రి ఉన్నా స‌రే న్యాయ‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు.

చూస్తుంటే.. చంద్ర‌బాబు భ‌విష్య‌త్తు క‌ళ్ల ముందు క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో. త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా విద్యుత్ సంస్థ‌లో బాబు ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌పై త‌ర‌చూ త‌ప్పు ప‌ట్టేవారు. తాజాగా ఇచ్చిన ఆదేశాల నేప‌థ్యంలో బాబు అండ్ కోకు భారీ ఇబ్బంది ఎదురుగా వ‌చ్చేసిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.