Begin typing your search above and press return to search.

అండ‌గా నిలిచిన గిరిజ‌నుల రుణాన్ని తీర్చుకున్న జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   26 Jun 2019 10:43 AM GMT
అండ‌గా నిలిచిన గిరిజ‌నుల రుణాన్ని తీర్చుకున్న జ‌గ‌న్‌
X
మాటంటే మాటే. మాట ఇచ్చే ముందు వ‌ర‌కు ఆలోచ‌న‌. ఆ త‌ర్వాత ఇచ్చిన మాట అమ‌లు కోసం ముందుకు వెళ్లిపోవ‌ట‌మే. త‌న తండ్రి దివంగ‌త మ‌హానేత వైఎస్ తీరును తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు ఏపీ యువ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఎన్నిక‌ల‌కు ముందు తాను జ‌రిపిన పాద‌యాత్ర సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసి.. త‌మ‌కున్న క‌ష్టాల్ని ప్ర‌స్తావించిన ప్ర‌తి ఒక్క‌రి మాట‌ను విన్న ఆయ‌న‌.. తాను అధికారంలోకి రాగానే వారి స‌మ‌స్య‌ల్ని తీరుస్తాన‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ప‌లు నిర్ణ‌యాల్ని చ‌క‌చ‌కా తీసుకున్న ఆయ‌న‌.. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. త‌న‌ను అక్కున చేర్చుకుంటూ రాష్ట్రంలోని అన్ని ఎస్టీ రిజ‌ర్వుడు సీట్ల‌ను గెలిచేలా చేసిన గిరిజ‌నుల రుణాన్ని తీర్చుకున్నారు జ‌గ‌న్‌. వారెంతగానో వ్య‌తిరేకిస్తున్న మైనింగ్ ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మైనింగ్ కార‌ణంగా త‌మ బ‌తుకులు ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌ని ఆందోళ‌న చెందుతున్న గిరిజ‌నుల‌కు ఊప‌శ‌మ‌నం క‌లిగేలా మైనింగ్ ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమ‌తించ‌మ‌ని తేల్చేశారు. తాజా నిర్ణ‌యంతో సంక్రాంతి.. ద‌స‌రా ఒక్క‌సారిగా వ‌స్తే ఎంత సంతోష‌ప‌డ‌తారో.. అంతే సంబ‌రాన్ని గిరిజ‌నులు పొందుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల వేళ ఓట్లు వేయించుకునే స‌మ‌యంలో హామీ ఇవ్వ‌టం కాదు.. చేతిలో అధికారంలో ఉన్న‌ప్పుడు ఆ హామీని నిల‌బెట్టుకోవ‌టానికి ఎంత‌టి ఇబ్బందిని ఎదుర్కొవ‌టానికైనా రెఢీ కావ‌టం మామూలు విష‌యం కాదు. ఆ విష‌యంలో తాను ముందు ఉంటాన‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ తాజా నిర్ణ‌యం చెప్పేసింద‌ని చెప్పాలి.