Begin typing your search above and press return to search.

ప్ర‌జావేదిక‌లో జ‌గ‌న్‌... భ‌ర‌త్ అనే నేను బ‌లాదూరే

By:  Tupaki Desk   |   24 Jun 2019 9:11 AM GMT
ప్ర‌జావేదిక‌లో జ‌గ‌న్‌... భ‌ర‌త్ అనే నేను బ‌లాదూరే
X
న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ కు నూత‌న ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌దైన శైలి పాల‌న‌ను జ‌నానికి రుచి చూపిస్తున్నారు. అవినీతి, ఆశ్రిత ప‌క్ష‌పాతంపై సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన నాడే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌గ‌న్‌... ఆ వ్యాఖ్య‌ల‌కు అనుగుణంగానే మ‌రింత సంచన‌లం రేకెత్తించేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. తాను సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక తొలిసారి క‌లెక్ట‌ర్ల కాన్ఫ‌రెన్స్ ను నేటి ఉద‌యం ప్రారంభించిన జ‌గ‌న్‌... తొలి స‌మావేశంలోనే త‌న‌దైన శైలిని చూపించారు. ఇటీవల టాలీవుడ్ లో వ‌చ్చిన ప్రిన్స్ మ‌హేశ్ బాబు చిత్రం *భ‌ర‌త్ అనే నేను* చిత్రాన్ని మ‌రిపించేలా జ‌గ‌న్ కొత్త సినిమాను చూపించారు. ఆ సినిమాలో సీఎం కుర్చీలో కూర్చునే హీరో... అవినీతిపై త‌న‌దైన శైలి పోరును ప్రారంభిస్తే... రియ‌ల్ లైఫ్ అంత‌కంటే మించిన స్థాయిలో అవినీతిపై అది కూడా స‌మావేశం జ‌రుగుతున్న ప్ర‌జా వేదిక‌లో చోటుచేసుకున్న అవినీతి, చ‌ట్టాల‌ను తుంగ‌లో తొక్కిన వైనాల‌ను ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌... మ‌హేశ్ బాబు సినిమాను మ‌రిపించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌జా వేదిక నిర్మాణంలో అడుగ‌డుగునా చోటుచేసుకున్న అక్ర‌మాల‌ను ఒక్కొక్క‌టిగానే ప్ర‌స్తావిస్తూ... వాటికి సంబంధించిన ప‌క్కా ఆధారాల‌ను చూపెడుతూ సాగిన జ‌గ‌న్ ప్ర‌సంగం నిజంగానే సినిమా సీన్ల‌కే హైలెట్ గా నిలిచింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌జా వేదిక ముమ్మాటికీ అక్ర‌మంగా నిర్మిత‌మైన క‌ట్ట‌డ‌మేన‌ని అందులోనే కూర్చుని సాక్ష్యాల‌తో స‌హా నిరూపించేసిన జ‌గ‌న్‌... ఫైన‌ల్ పంచ్ అన్న‌ట్లుగా ఈ స‌మావేశం ముగియ‌గానే కూల్చివేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఔరా అనిపించారు. అంతేకాకుండా ఇక్క‌డే ఈ స‌మావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశాన‌న్న విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌... ప్ర‌జా వేదిక నిర్మాణంలో చోటుచేసుకున్న అక్ర‌మాల‌ను అందులో కూర్చుని చెబితేనే బాగుంటుంద‌నిపించి స‌మావేశాన్ని ఇక్క‌డే ఏర్పాటు చేశామ‌ని చెప్పి అంద‌రినీ అమితాశ్చ‌ర్యానికి గురి చేశారు.

ఇక ప్ర‌జా వేదిక నిర్మాణంలో చోటుచేసుకున్న అక్ర‌మాల‌ను జ‌గ‌న్ ఏ రీతిన ఎండ‌గ‌ట్టార‌న్న విష‌యానికి వ‌స్తే... కృష్ణా న‌దీ తీరంలో నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కేసి ఈ నిర్మాణాన్ని క‌ట్టార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కృష్ణా న‌దిలో ప్ర‌జా వేదిక నిర్మించిన ప్రాంతంలో మ్యాగ్జిమ‌మ్ ఫ్ల‌డ్ లెవెల్ 22.60 మీట‌ర్లుగా ఉంటే... హ‌య్కెస్ట్ ఫీల్ లెవెల్ 19.50 మీట‌ర్లుగా ఉంద‌న్నారు. అంటే ఫ్ల‌డ్ లెవెల్ లో క‌న్నా త‌క్కువ లెవెల్ లో ఉంద‌ని గణాంకాలు చెబుతున్నాయ‌ని చెప్పారు. అంటే...ఈ నిర్మాణంలో నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కిన‌ట్టే క‌దా అని గుర్తు చేశారు. ఇక ఇక్క‌డ గ్రీవెన్స్ హాల్ పేరిట ప్ర‌తిపాదించిన ఈ నిర్మాణానికి అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని కృష్ణా సర్కిల్ డివిజ‌న్ ఎగ్జీక్యూటివ్ ఇంజినీర్ ప్ర‌భుత్వానికి రాసిన లేఖను కూడా జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. మొత్తంగా రివ‌ర్ ర‌న్జ‌ర్వేష‌న్ యాక్ట్‌, లోకాయుక్త రిక‌మెండేష‌న్స్ ను ఓవ‌ర్ రూల్ చేసేశార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

ఇక టెండ‌రింగ్ విష‌యంలోనూ చంద్ర‌బాబు స‌ర్కారు అనుస‌రించిన విధానాన్ని కూడా జ‌గ‌న్ ఏకిపారేశారు. మంత్రి సూచ‌న మేర‌కు షార్ట్ టెండ‌ర్ పిలుస్తున్నామ‌ని, ఇందుకు వారం మాత్రమే గ‌డువు విధిస్తూ టెండ‌ర్ నోటిఫికేష‌న్ ను జారీ చేసి... ఇద్ద‌రు బిడ్డ‌ర్లు వ‌స్తే... ఎన్ సీసీ కంపెనీకి టెండ‌ర్ ను ఇచ్చేందుకు ముందుగానే రంగం సిద్ధం చేసుకుని రెండో కంపెనీగా వ‌చ్చిన అశోకా క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీని అర్హ‌త లేద‌ని టెండ‌ర్ ప్ర‌క్రియ నుంచి తొల‌గించేశార‌ని కూడా జ‌గ‌న్ వివ‌రించారు. ఇక టెండ‌ర్ లో ప్ర‌జావేదిక నిర్మాణం వ్య‌యాన్ని రూ.5కోట్లుగా నిర్ధారించి, ఎన్ సీసీకి టెండ‌ర్ ద‌క్క‌గానే.. ఆ రేటును ఏకంగా రూ.8.9 కోట్ల‌కు పెంచేశార‌ని చెప్పారు.

మొత్తంగా ఇన్ని అక్ర‌మాలున్న ఈ నిర్మాణాన్ని కొన‌సాగించాలా? అంటూ ప్ర‌శ్నించిన జ‌గ‌న్... అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌ల‌ను ప్ర‌జావేదిక కూల్చివేత‌తోనే మొద‌లుపెట్ట‌నున్న‌ట్లుగా జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మొత్తంగా భ‌ర‌త్ అనే నేను... చిత్రంలో సీఎం హోదాలోని హీరో అవినీతిపై చేసిన కామెంట్ల‌ను త‌ల‌ద‌న్నే రీతిలో ప్ర‌జావేదిక‌లో రియ‌ల్ లైఫ్ సీఎం హోదాలో జ‌గ‌న్ సంచ‌ల‌నాత్మ‌క కామెంట్లు చేశారు. అంతేకాకుండా సినిమాలో క‌నిపించే స‌న్నివేశాలు రియ‌ల్ లైఫ్ లో క‌నిపిస్తే ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని కూడా జ‌గ‌న్ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపార‌న్న వాద‌న వినిపిస్తోంది.