Begin typing your search above and press return to search.

జగన్ వ్యూహాత్మక అడుగులు

By:  Tupaki Desk   |   13 Nov 2021 1:30 PM GMT
జగన్ వ్యూహాత్మక అడుగులు
X
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ ను చాలా పక్కాగా వ్యవహరిస్తున్నారు. తనను నమ్ముకున్న సామాజికవర్గాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రకటించిన 11 మంది ఎంఎల్సీల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంతకుముందు ముగ్గురిని ఎంపిక చేశారు. అంటే ఎంఎల్ఏ కోటాలో ముగ్గురికి, స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయబోయే 11 ఎంఎల్సీలకు మొత్తం కలిపి 14 స్ధానాలకు జగన్ పేర్లను ప్రకటించినట్లయ్యింది.

మొత్తం 14 పేర్లను పరిశీలిస్తే ఏడుగురు నేతలను ఎస్సీ, బీసీ, మైనారిటి వర్గాల నుండి ఎంపిక చేశారు. మిగిలిన ఏడు స్ధానాల్లో క్ష్తత్రియ, కమ్మ, రెడ్డి, కాపు నేతలను ఎంపిక చేశారు. మొత్తంమీద తనకున్న అవకాశం మేరకు ఇటు అగ్రవర్ణాల్లోను అటు వెనకబడిన వర్గాలకూ న్యాయం చేసినట్లు అనిపించారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి లక్ ఏమిటంటే ఒకేసారి 14 ఎంఎల్సీ స్ధానాలను భర్తీ చేసే అవకాశం రావటం. గతంలో ఏ పార్టీకి కూడా ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేసే అవకాశం బహుశా వచ్చుండదేమో.

రాను రాను ఎన్నికలంతా సామాజికవర్గాల చుట్టూతే తిరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఇదే పద్దతిలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పటినుండి జగన్ సోషల్ ఇంజనీరింగ్ ను పక్కాగా అనుసరిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 1982లో ఏర్పాటైన దగ్గర నుండి తెలుగుదేశంపార్టీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీ సామాజికవర్గాన్ని కూడా జగన్ తనవైపు ఆకర్షిస్తున్నారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి టీడీపీని కాదని బీసీలు వైసీపీకి మద్దతు ఇచ్చింది 2019లోనే.

ప్రతిపక్షంలో ఉన్నపుడే రాయలసీమలోని ఎనిమిది ఎంసీ సీట్లలో ఆరింటిని, అలాగే ఎంఎల్ఏ సీట్లు, ఎంఎల్సీలు, పార్టీ పదవులు ఇలా ఏది తీసుకున్నా బీసీలు, మైనారిటిలు, కాపులు, ఎస్సీ, ఎస్టీలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో చెప్పింది ఆచరణలో చూపించిన వైసీపీకే 2019లో పై వర్గాలు మద్దతుగా నిలిచాయి. ఇందులో భాగంగానే బీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయటం. అప్పటినుండి జగన్ ప్రతి అడుగులోను సోషల్ ఇంజనీరింగ్ కే పెద్ద పీట వేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీని పూర్తిగా నేలమట్టం చేయటమే టార్గెట్ గా జగన్ ఇప్పటినుండే పావులు కదుపుతున్నారు. టీడీపీకి ఇంకా మద్దతుగా నిలుస్తున్న బీసీ వర్గాలను పూర్తిగా దూరం చేసి తనవైపుకు తిప్పుకోవటమే జగన్ అసలైన వ్యూహంగా కనబడుతోంది. ఇందులో గనుక జగన్ విజయంసాధిస్తే ఇక టీడీపీ పరిస్దితి తెలంగాణాలో లాగే అయిపోవటం ఖాయం. మరి 2024 ఎన్నికల్లో జనాలు ఇచ్చే తీర్పు ఎలాగుంటుందో చూడాల్సిందే.

ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేకించి కుప్పంలో కూడా సోషల్ ఇంజనీరింగ్ పద్దతిలో ఎంఎల్సీల ఎంపిక ప్రభావం ఉంటుందేమో చూడాలి. ఎందుకంటే కుప్పం ఇన్చార్జి భరత్ కు కూడా ఎంఎల్సీ అవకాశం దక్కింది కాబట్టి. చూద్దాం ఫలితం ఎలాగుంటుందో.