Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఆ 120 ఎకరాల భూములని దుర్గ గుడికి..!

By:  Tupaki Desk   |   27 March 2021 5:50 AM GMT
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఆ 120 ఎకరాల భూములని దుర్గ గుడికి..!
X
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా పెండింగ్ ‌లో ఉన్న పనిని పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. కనకదుర్గమ్మ కొండపై ఉన్న భూములను ఆలయ బోర్డుకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కనక దుర్గమ్మ కొలువైన కొండనంతా ఇంద్రకీలాద్రి అంటున్నా, ఈ కొండంతా ఆలయం బోర్డు ఆధీనంలో లేదు. కొండ మీద అంతా అటవీ ప్రాంతం కావడంతో.. ఈ ఏరియా అంతా అటవీశాఖ ఆధీనంలో ఉంది. ఆలయ ప్రాంగణంతో పాటు చుట్టు పక్కల ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే ప్రతీసారి అటవీశాఖ, ఇతర విభాగాల అనుమతులు తీసుకోవడం సమస్యగా మారుతోంది.

దీనితో ఇంద్రకీలాద్రి పరిధిలో ఉన్న 120 ఎకరాల భూమి మొత్తాన్ని ఆలయం బోర్డుకు అప్పగించాలనే డిమాండ్లు చాలా కాలం నుంచి ఉన్నాయి. ఇటీవల జరిగిన దుర్గగుడి ఆలయ బోర్డు సమావేశంలో కొండను ఆలయ ట్రస్ట్ బోర్డుకు అప్పగించాలనే ప్రతిపాదన పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా, అది ఇంత వరకూ అమలులోకి రాలేదు. అటవీశాఖ పరిధిలో ఉన్న ఇంద్రకీలాద్రి భూమిని దుర్గ గుడికి బదలాయింపుకు సంబంధించిన ఫైలు కదిలినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆలయం ఉన్న స్థలానికి పురాణ, చారిత్రక ప్రాధాన్యం ఉంది. అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందిన ఆలయం, నటరాజు, గణపతి ఆలయాల అభివృద్ధి, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాల కల్పన, ఇతర మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయడానికి స్థలం పెద్ద సమస్యగా తయారైంది.

ఏ పని చేయాలన్నా స్థలం లేకపోవడం, అనుమతుల్లో జాప్యం వల్ల అనుకున్నంత వేగంగా ఆలయం అభివృద్ది చెందడం లేదు. కొండను తమకు కేటాయిస్తే సమస్యలన్నింటిని పరిష్కరించడంతోపాటు కొండ చరియలు విరిగి పడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని ఆలయ బోర్డ్ చెప్తుంది. కాగా, ఇంద్రకీలాద్రి పై ఉన్న 120 ఎకరాలు దుర్గామల్లీశ్వర అమ్మవారి దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంద్రకీలాద్రి భూముల బదలాయింపునకు సంబంధించి కలెక్టర్ వివరాలు తీసుకున్నారు. సీఎం జగన్ కూడా ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ. 70 కోట్ల రూపాయలు కేటాయించారు. కొండ దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు అప్పగిస్తే గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులను చేపట్టి ముందుకు వెళ్తామని బోర్డు సభ్యులు చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక ఇంద్రకీలాద్రి కొండ దుర్గా ట్రస్ట్ బోర్డ్ అధీనంలోకి రానుంది.