Begin typing your search above and press return to search.

జగనన్న స్మార్ట్ టౌన్ ..పేదల కోసం సీఎం సంచలన నిర్ణయం!

By:  Tupaki Desk   |   6 April 2021 9:30 AM GMT
జగనన్న స్మార్ట్ టౌన్ ..పేదల కోసం సీఎం సంచలన నిర్ణయం!
X
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక పథకాలను, రాష్ట్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉండటానికి ఇల్లు లేని వారంటూ ఉండకూడదు అని ఇప్పటికే ఇంటి స్థలాలను పంపిణి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు, అల్పాదాయ వర్గాల వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇళ్ళు లేని వారు ఎవరూ ఉండకూడదని జగనన్న స్మార్ట్ టౌన్ పథకానికి శ్రీకారం చుట్టింది.

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో మధ్యతరగతి వర్గాల వారికి ఇళ్ల స్థలాలను అందించడానికి వీఎంసి కమిషనర్ ఓ ప్రకటన సైతం విడుదల చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఐదు కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉండేలా ఇళ్ళ స్థలాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఇక మధ్యతరగతి వారికి అందించే ఈ స్థలాలను అన్ని వసతులతో ను అభివృద్ధి చేసి అందిస్తామని వివరించారు. విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాలు ఏర్పాటు చేయడంతో పాటుగా పార్కులు , మౌలిక సదుపాయాల కొరకు ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. కమ్యూనిటీ హాల్, పాఠశాల భవనాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. షాపింగ్ సెంటర్, బ్యాంక్, మార్కెట్ వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం మొదలగు అన్ని వసతులను కూడా కల్పిస్తామని ఆయన వెల్లడించారు. వాటర్, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. మూడు లక్షల నుండి 18 లక్షల లోపు సంవత్సరాదాయం కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులని, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ పథకం లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

150 చదరపు గజాలకు, అంటే మూడు సెంట్ల స్థలానికి సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు ఉండాలని అన్నారు. 200 చదరపు గజాలకు అంటే నాలుగు సంఖ్య సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి ఆరు లక్షల నుండి 12 లక్షల రూపాయలు ఉండాలని, 240 చదరపు గజాల కు అంటే ఐదు సెంట్ల కు సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి 12 లక్షల నుండి 18 లక్షల రూపాయలు ఉండాల్సి ఉంటుందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. దీనిలో భాగంగా సచివాలయ సిబ్బంది ఈరోజు, రేపు డిమాండ్ సర్వే నిర్వహిస్తున్న కారణంగా అర్హులైన నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని , దరఖాస్తు చేసుకోవచ్చని విజయవాడ నగర కమిషనర్ తెలిపారు.