Begin typing your search above and press return to search.

'ఆపరేషన్‌ గరుడ' లో చెప్పిన‌ట్లే హ‌త్యాయ‌త్నం: జ‌గ‌న్

By:  Tupaki Desk   |   30 Oct 2018 7:26 AM GMT
ఆపరేషన్‌ గరుడ లో చెప్పిన‌ట్లే హ‌త్యాయ‌త్నం: జ‌గ‌న్
X
విశాఖ విమానాశ్ర‌యంలో త‌న‌పై జ‌రిగిన దాడికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి తొలిసారిగా బ‌హిరంగంగా స్పందించారు. దాడిపై త‌నకు తెలిసిన వివ‌రాలు - త‌న‌కున్న అనుమానాల‌ను తెలియ‌జేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కు ఆయ‌న లేఖ రాశారు. ఈ లేఖ‌ను వైసీపీ నేత‌లు రాజ్‌ నాథ్‌ కు సోమ‌వారం అంద‌జేశారు. త‌న‌పై కుట్ర ప్ర‌కార‌మే హ‌త్య జ‌రిగింద‌ని లేఖ‌లో జ‌గ‌న్ పేర్కొన్నారు. 'ఆప‌రేష‌న్ గ‌రుడ‌'లో చెప్పిన‌ట్లే హ‌త్యాయ‌త్నం చోటుచేసుకుంద‌ని గుర్తుచేశారు. వాస్త‌వాల‌ను నిగ్గు తేల్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని రాజ్‌ నాథ్‌ కు జ‌గ‌న్ విన్న‌వించారు.

'రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ప్రమాదకర పరిస్థితులను మీ దృష్టికి తేవాలని ఈ లేఖ రాస్తున్నా. 2018 అక్టోబరు 25న సుమారు మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖ ఎయిర్‌ పోర్టు వీఐపీ లాంజ్‌ లో గుర్తుతెలియని దుండగుడు నాపై హ‌త్యాయ‌త్నం చేశాడు. సెల్ఫీ ఫోటో తీసుకోవాలంటూ నాకు అత్యంత చేరువగా వచ్చి.. పదునైన‌ సాధనంతో నా గొంతులో పొడిచేందుకు ప్రయత్నించాడు. నేను వెంటనే స్పందించి ఆత్మరక్షణ కోసం మెడకు తగలకుండా భుజాన్ని అడ్డుపెట్టడంతో నా ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతున కోసుకుపోయింది. దుండగుడిని వెంటనే పట్టుకుని అక్కడ ఉన్న సీఐఎస్ ఎఫ్‌ సిబ్బందికి అప్పగించారు. ఎయిర్‌ పోర్టులో ఉన్న డ్యూటీ డాక్టర్‌ నాకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందజేశారు'అని దాడి తీరును జ‌గ‌న్ లేఖ‌లో వివ‌రించారు.

త‌న‌పై చోటుచేసుకున్న హ‌త్యాయ‌త్నంపై ద‌ర్యాప్తు చేయ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. వైసీపీలో అంత‌ర్గ‌త కుట్ర‌గా దాడిని చిత్రీక‌రించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింద‌ని ఆరోపించారు. వార్త‌ల్లో వ్య‌క్తిగా మారేందుకే నిందితుడు త‌న‌పై దాడికి పాల్ప‌డిన‌ట్లు డీజీపీ కూడా తొంద‌ర‌పాటు ప్ర‌క‌ట‌న చేశార‌ని పేర్కొన్నారు. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు కూడా పూర్తికాకుండా అలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం తానే దాడి చేయించుకున్న‌ట్లు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు - టీడీపీ నేత‌లు ప‌లుమార్లు ప్ర‌క‌ట‌న‌లు చేశార‌ని జ‌గ‌న్ తెలిపారు. వారి ప్ర‌క‌ట‌న‌ల‌తో తాను దిగ్భ్రాంతికి గుర‌య్యాన‌ని చెప్పారు. ద‌ర్యాప్తు ప్ర‌క్రియ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. నిందితుడు శ్రీనివాస‌రావు ఇంట్లో స్వ‌ర్గీయ వైఎస్సార్ ఫొటో దొరికిందంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఓ ప్రెస్‌ మీట్‌ లో చెప్పిన సంగ‌తిని జ‌గ‌న్ గుర్తుచేశారు. టీడీపీ సానుభూతిప‌రుడైన ఓ వ్య‌క్తి చెప్పిన 'ఆప‌రేష‌న్ గ‌రుడ' భావ‌న ప్ర‌కార‌మే త‌న‌పై తాజా హ‌త్యాయ‌త్నం చోటుచేసుకుంద‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. హ‌త్యాయ‌త్నం విఫ‌ల‌మ‌వ్వ‌డంతో త‌న‌పై బుర‌ద జ‌ల్లేందుకు టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. పార‌ద‌ర్శ‌క ద‌ర్యాప్తుతో నిజానిజాల‌ను నిగ్గు తేల్చేందుకుగాను రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో లేని సంస్థ‌తో త‌న‌పై జ‌రిగిన దాడిపై ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని రాజ్‌ నాథ్‌ కు జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు.