Begin typing your search above and press return to search.

బీసీల‌పై జ‌గ‌న్ కుండ పోత ప్రేమ‌!

By:  Tupaki Desk   |   7 Dec 2022 8:30 AM GMT
బీసీల‌పై జ‌గ‌న్ కుండ పోత ప్రేమ‌!
X
విజ‌య‌వాడ‌లో ఈ రోజు నిర్వ‌హించిన `జ‌య‌హో బీసీ` స‌భ‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బీసీల‌పై కుండ పోత వ‌ర్షం అన్న‌ట్టుగా కుండ‌పోత ప్రేమ‌ను కురిపించారు. `నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది` అంటూ ప్ర‌సంగాన్ని ప్రారంభించిన ఆయ‌న‌.. మీ హృదయంలో జగన్‌.. నా హృదయంలో మీరు ఉన్నార‌ని తెలిపారు.

బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్‌ క్లాసులని జ‌గ‌న్ అభివ‌ర్ణించారు. వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పేలా ఈ మూడున్న‌రేళ్ల త‌న పాల‌న‌లో అడుగులు వేస్తున్న‌ట్టు జ‌గ‌న్ ఉద్ఘాటించారు.

బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ అని సీఎం తెలిపారు. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని ప్ర‌సంశ‌ల జ‌ల్లు కురిపించారు.

పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింద‌న్న ఆయ‌న.. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసిందని చెప్పారు. త‌న పాల‌న‌లో రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశానంటూ ప‌ర‌క్షంగా ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం పేరును ప్ర‌స్తావించారు. బీసీ కులాలన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్రలో చెప్పిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని మేం అమలు చేశామ‌న్న సీఎం.. దేశంలోనే తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ తెచ్చిన‌ట్టు చెప్పుకొచ్చారు.

నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు బీసీల‌కు ఇచ్చ‌మ‌న్నారు. చిరువ్యాపారులకు తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు పథకం తెచ్చామ‌ని వివ‌రించారు. బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదని, ప‌రోక్షంగా చంద్ర‌బాబు పాల‌న‌పై విరుచుకుప‌డ్డారు.