Begin typing your search above and press return to search.

యుగానికొక్కడు.. వైఎస్ ఆర్

By:  Tupaki Desk   |   8 July 2018 8:25 AM GMT
యుగానికొక్కడు.. వైఎస్ ఆర్
X
మాట తప్పని.. మడమ తిప్పని నైజం ఆయన సొంతం.. ఎంతటి సమస్యను అయినా ఎదుర్కొనే మొండి దైర్యం.. రైతులకు అనంతమైన విశ్వాసం.. అపర భగీరథుడిగా జలయజ్ఞం మొదలు పెట్టిన ధీశాలి.. మావనవీయతకు నిలువెత్తు నిదర్శనం.. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తత్వం.. ఆయనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీపై చెరగని ముద్రవేసిన వైఎస్ పుట్టినరోజు నేడు.. ఈ సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం..

*వైఎస్ బాల్యం.. విద్యాభ్యాసం

కడప జిల్లా సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో యెడుగూరి సందింటి రాజారెడ్డి-జయమ్మ దంపతులకు 1949, జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మించారు. పులివెందులలోని వెంకటప్ప ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతి చదివాడు. వైఎస్ రాజారెడ్డి కాంట్రాక్ట్ పనులపై బయట ప్రాంతాల్లో తిరుగుతుండేవారు. దీంతో పిల్లల చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో వైఎస్ ఆర్ తో పాటు ఆయన సోదరుడు వివేకా - సోదరి విమలమ్మను పులివెందుల లోని వెంకటప్ప అనే ఉపాధ్యాయుడి ఇంట్లో వదిలిపెట్టారు. వెంకటప్ప కమ్యూనిస్టు.. వైఎస్సార్ పై గురువు వెంకటప్ప ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. 8వ తరగతి తరువాత బళ్లారిలోని సెయింట్ జాన్ స్కూల్ లో వైఎస్ 10వ తరగతి పూర్తి చేశాడు. విజయవాడ లయోలా కాలేజీలో పీయూసీ - వైద్యవిద్యకు వయసు తక్కువగా ఉండడంతో బళ్లారిలో బీఎస్సీ ఏడాది చదివాడు. అనంతరం గుల్బార్గా ఎమ్మార్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ - తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో మౌస్ సర్జన్ పూర్తి చేశారు.

*రాజకీయ ప్రవేశం..

విద్యార్థి సంఘం నాయకుడిగా వైఎస్ రాజకీయ జీవితం గుల్బర్గా మెడికల్ కాలేజీలో మొదలైంది. ఆ తర్వాత 1975లో యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఎదిగాడు. 1978లో మొదటిసారి రెడ్డి కాంగ్రెస్ తరఫున పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది చట్టసభలో అడుగుపెట్టారు. అప్పటికి ఆయన వయసు కేవలం 29 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత ఇందిర కాంగ్రెస్ లో చేరారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. నాలుగు సార్లు ఎంపీగా ఓటమెరుగని నేతగా చరిత్రలో నిలిచారు. రాష్ట్రమంత్రిగా మూడు సార్లు పనిచేశారు. 1980-82లో గ్రామీణాభివృద్ధి - 1982లో ఎక్సైజ్ శాఖ - 1982-83లో విద్యామంత్రిగా సేవలను అందించారు. అలాగే కేవలం 33 ఏళ్ల వయసులో రాష్ట్ర కాంగ్రెస్ కు సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. 2004 - 2009లో రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

*పాదయాత్రతో రాజకీయాధికారం..

2003 - ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఇటు కాంగ్రెస్ కు - అటు వైఎస్ ఆర్ జీవితంలో మరుపురానిదిగా నిలిచింది. ఉమ్మడి ఏపీలో 11 జిల్లాల పరిధిలో చేవెళ్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకూ 68రోజులపాటు 1470 కి.మీల మేర సాగింది. పాదయాత్ర కాంగ్రెస్ కు ప్రాణం పోసింది. వైఎస్ ఆర్ జీవితాన్ని మలుపుతిప్పి అధికారంలోకి తీసుకొచ్చింది. దీంతో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు.

*సంక్షేమ పథకాల వాన కురిపించిన వైఎస్

రాజకీయాల్లోకి రాకముందు డాక్టర్ అయిన వైఎస్ కు ప్రజల నాడి బాగా తెలుసు. పాదయాత్ర సందర్భంగా ప్రజల అవసరాలను గుర్తించి అధికారంలోకి రాగానే పథకాలకు రూపకల్పన చేశాడు. మొట్టమొదట రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్ పై సంతకం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో భావి జీవితానికి బాటలు వేయగా.., ఆరోగ్య శ్రీ పథకంతో పేదరోగులకు ఊపిరిపోశారు. జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు రూపశిల్పి వైఎస్సే. జలయజ్ఞంతో ప్రాజెక్టులను చేపట్టారు. 2009లో రెండో సారి అధికారంలోకి వచ్చి సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ కర్నూలు-ప్రకాషం జిల్లాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతంలో హెలీ క్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. తుది శ్వాస విడిచే వరకూ ప్రజలకు మేలు చేయాలని తపించి మహానేతగా అందరి గుండెల్లో నిలిచిపోయారు.

జననేత జనరంజక పాలనతో ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రత్యేక స్థానం సంపాదించాడు. జూలై 8న వైఎస్ఆర్ జయంతి. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకుందాం..