Begin typing your search above and press return to search.

1993..ఏజెంట్లుగా బాబు, వైఎస్. ఏం చేశారంటే

By:  Tupaki Desk   |   25 March 2019 11:06 AM GMT
1993..ఏజెంట్లుగా బాబు, వైఎస్. ఏం చేశారంటే
X
రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి అగ్రనేతగా ఎదగడం ఈరోజుల్లో చాలా కష్టం. కానీ ఒకప్పుడు కిందిస్థాయి నుంచి సిద్ధహస్తులైన ముఖ్యమంత్రుల స్థాయికి ఎదిగిన వారిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారు. వీరు ఓ ఉప ఎన్నికల్లో జనరల్‌ ఏజెంట్లుగా పనిచేయడం విశేషం.. అదీ కడప జిల్లాలోని రాయచోటి నియోజకర్గంలో. పూర్తిగా సున్నిత ప్రాంతం కావడం.. ఫ్యాక్షనిజానికి గడ్డగా పేరొందిన ఈ నియోజకవర్గంలో వీరు పోలింగ్‌ ఏజెంట్లు ఒకప్పుడు పనిచేశారు.

1993 సంవత్సరం కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం. అప్పట్లో కొన్ని కారణాలా వల్ల ఇక్కడ ఉప ఎన్నిక అవసరం ఏర్పడింది. దీంతో భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరుపున పాలకొండ్రాయుడు, కాంగ్రెస్‌ తరుపున మండిపల్లి నారాయణరెడ్డి బరిలో నిలిచారు. అప్పటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నారు.

దీంతో ఇక్కడ జనరల్‌ ఏజెంట్లుగా టీడీపీ తరుపున చంద్రబాబునాయుడు, కాంగ్రెస్‌ తరుపున వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పనిచేశారు. ఈ సమయంలో డైట్‌ పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు వేయిస్తున్నారని కొందరు కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీంతో ఆ పోలింగ్‌ కేంద్రానికి బాబు వెళ్లారు. అక్కడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. కానీ అనుకున్నంత సమస్య ఏం ఎదురుకాలేదు.

అయితే ఇరువురు అప్పటికే పార్టీల్లో కీలకంగా ఉన్న నేతలు. ఒకరినొకరు ఎదురుపడ్డారు. ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఎదురుపడతాయని పోలీసు బందోబస్తు బాగానే ఏర్పాటు చేశారు. అయితే చివరికి చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిలు ఇద్దరు చిరునవ్వుతూ పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు రావడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ తర్వాత సీఎంలుగా ఎదిగారు. ఈ ఎన్నికల వేళ.. ఇప్పుడు ఆ సంఘటనను రాయచోటి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సీఎం బాబు, వైఎస్ లు మా నియోజకవర్గంలో ఏజెంట్లుగా చేశారని గర్వంగా చెబుతున్నారు.