Begin typing your search above and press return to search.

ఒక షర్మిల... ఒక కవిత... ..అన్నయ్యల అండ కరవైన వేళ...?

By:  Tupaki Desk   |   2 Dec 2022 12:30 PM GMT
ఒక షర్మిల... ఒక కవిత... ..అన్నయ్యల అండ కరవైన వేళ...?
X
అన్నా చెల్లెళ్ళ బంధం అపురూపం అని అంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలా సోదర బంధం కలవదని అంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా అన్నకు చెల్లెలు, అలాగే చెల్లెలుకు అన్న అండగా జీవితపర్యంతం నిలుస్తారు అని చెబుతారు. ఇది జరిగింది కూడా.

కానీ తెలుగునాట ఇద్దరు ఆడపడుచులకు మాత్రం అన్నల అండ ఎంత మేర ఉంది అంటే సందేహమే సమాధానం అవుతోంది. వైఎస్ షర్మిల, ఏపీ సీఎం జగన్ చెల్లెలు. వైఎస్సార్ గారాల పట్టి. ఆమె రాజకీయాల్లో తానూ ఉండాలనుకున్నారు. వైఎస్సార్టీపీని స్థాపించి తెలంగాణాలో ఒంటరిగా పోరాడుతున్నారు.

ఆమె పార్టె పెట్టినపుడు మద్దతు వైసీపీ నుంచి కానీ జగన్ నుంచి కానీ దక్కలేదు. ఇక రెండేళ్ళుగా ఆమె పాదయాత్ర చేపడుతూ వస్తోంది. అయితే గత నాలుగైదు రోజులుగా ఆమె తెలంగాణాతో పాటు జాతీయ రాజకీయాలలో కీలకమైన చర్చగా మారారు. ఆమె కారులో కూర్చుంటే అదే కారు ని క్రేన్ల సాయంలో తీసుకుపోయి ఎత్తి కుదేసి పడేసిన కర్కశత్వాన్ని తెలంగాణా ప్రభుత్వం చూపించింది.

అదే టైం లో టీయారెస్ నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు. ఆమె వాహనాన్ని ద్వంసం చేశారు. ఇక ఆమెకు ఈ ఘటనలో గాయాలు అయ్యాయి. మొత్తానికి చూస్తే షర్మిల ఇపుడు కొండ లాంటి టీయారెస్ ని ఢీ కొడుతున్నారు. ఆమెని పోలీస్ స్టేషన్ లో పెట్టినపుడు రిమాండ్ తరలించాలని చూసినపుడు కూడా ఏపీ సీఎం జగన్ వైపు నుంచి ఒక్క సానుభూతి మాట రాలేదని అంతా అనుకున్నారు.

స్వయనా జగన్ తల్లి విజయమ్మ అయితే ఏపీ సీఎం గురించి మనకెందుకు అని మీడియా ముందే అన్నారంటే ఎంతటి నిర్వేదంతో ఆమె ఈ మాటలు అని ఉండవచ్చు అనుకోవాలి. అదే విధంగా చూస్తే షర్మిల ఒకనాడు జగన్ జైలు పాలు అయితే తాను జగన్ విడిచిన బాణాన్ని అంటూ ఉమ్మడి ఏపీ అంతా తిరిగి పార్టీని నిలబెట్టారు. ఇపుడు తాను కష్టకాలంలో ఉంటే అలాంటి మద్దతుని ఆమె ఆశిస్తున్నారు.

కానీ అది దక్కడంలేదు అని అంటున్నారు. మరి షర్మిల పరిస్థితి అలా ఉంటే తెలంగాణాలో మరో చెల్లెలు ఉంది. ఆమె కవిత. టీయారెస్ లో కీలకంగా ఉన్న నాయకురాలు ఆమె. అయితే ఆమె మీద ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు వినిపించాయి. ఇపుడు చూస్తే ఆధారాలు ఏవో ఉన్నాయని ఆమె పేరుని కూడా ఈడీ చేర్చింది. దాంతో కవిత ఆ ఇబ్బందుల నుంచి సతమతమవుతున్నారు.

ఆమెకు అన్న కేటీయార్ నుంచి మద్దతు లభించడంలేదని అంటున్నారు. చెల్లెలుకు బాసటగా అన్న ఒక్క మాట అనలేదని కూడా అనేవారు ఉన్నారు. ఇంతే కాదు, ఈ స్కాం లో కవిత పేరు ఉండడం మీద కేసీయార్, కేటీయార్ ఆమెని పిలిచి మందలించారని కూడా ప్రచారం సాగుతోంది. వంద కోట్ల నగదు బదిలీ వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తున్న వేళ టీయారెస్ నుంచి ప్రత్యేకించి అన్న నుంచి ఆమెకు సానుకూల మద్దతు రాలేదని అంటున్నారు.

మరి ఇలాంటి కఠిన పరీక్ష వేళ కవిత అయితే తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే అని అన్నారంటే ఆమె ఎంత వత్తిడికి గురి అయ్యారో అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఇలా ఒక ఆడపడుచు ప్రకటించినప్పటికీ అటు కేసీయార్ నుంచి కానీ ఇటు కేటీయార్ నుంచి కానీ ఆమెకు సానుభూతిగా ఒక్క పదం కూడా రాలేదని అంటున్న వారూ ఉన్నారు.

మరో వైపు చూస్తే మద్యం కుంభకోణంలో బీజేపీ నేతలు ఆమెపై ఆరోపణలు గుప్పించిన వెంటనే కేసీఆర్ కవితను పిలిచి మందలించినట్లుగా ప్రచారం సాగింది. సంబంధం లేని విషయాల్లో అనవసరంగా ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని కవితను కేసీఆర్ ప్రశ్నించారని అంటున్నారు. అలాగే ఇపుడు ఈడీ రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు కనిపించడంతో, కేటీఆర్ కూడా ఆమెను తప్పుపట్టారని గట్టిగానే ప్రశ్నించారని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి.

అలాగే తండ్రి సోదరుడి నుంచి తగిన సహకారం రాకపోవడంతో పాటు మందలింపులే బహుమానంగా రావడంతోనే కవిత మీడియా ముందుకు కన్నీటితో రావాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.ఇవన్నీ చూస్తూంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్నదమ్ముల సెంటిమెంట్ లేదా. చెల్లెళ్ళకు బాసటగా అన్నలు నిలిచే సీన్ కనిపించదా అన్న చర్చ వస్తోంది. ఎంతైనా రాజకీయం ఇది. ఇందులో ఇలాగే ఉంటుంది అన్న వారూ ఉన్నారు. సో ఇది ఇంతేనేమో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.