Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ నిర్ణ‌యంపై ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   22 Sep 2022 6:38 AM GMT
జ‌గ‌న్ నిర్ణ‌యంపై ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్‌!
X
విజ‌య‌వాడ‌లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిల త‌ప్పుబ‌ట్టారు. ఈ మేర‌కు ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌జాప్ర‌స్థానం పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న ష‌ర్మిల ఒక టీవీ చానెల్‌లో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇలా పేర్లు మార్చుకుంటూ పోవ‌డం స‌రికాద‌న్నారు. ఒక పేరు అంటూ పెట్టాక అదే పేరును కొన‌సాగించాల‌న్నారు.

ఇలా పేర్లు మారిస్తే అప్ప‌టివ‌ర‌కు ఆ సంస్థ‌కున్న ప‌విత్ర‌త పోతుంద‌న్నారు. అంతేకాకుండా అన‌వ‌స‌ర‌మైన అయోమ‌యాన్ని సృష్టించిన‌ట్టు అవుతుంద‌న్నారు. ఒక్కొక్క‌రు ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే ఎవ‌రు ఏది రిఫ‌ర్ చేస్తున్న‌ది కూడా అర్థం కాద‌ని ష‌ర్మిల అన్నారు. ఉన్న పేరునే కొన‌సాగిస్తే ఆ పేరును త‌ర‌త‌రాలు గౌర‌వించిన‌ట్టు అవుతుంద‌ని చెప్పారు.

ఇప్ప‌టికే జ‌గ‌న్ నిర్ణ‌యంపై టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, క‌మ్యూనిస్టు పార్టీలు, వివిధ సంఘాలు భ‌గ్గుమ‌న్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా స్వ‌యంగా వైఎస్సార్సీపీలోనే నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి ఆయ‌న పేరును తొల‌గిస్తూ వైఎస్సార్ పేరు పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ అధికార భాషా సంఘం అధ్య‌క్ష ప‌ద‌వికి యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ రాజీనామా చేశారు. మ‌రోవైపు వైఎస్సార్సీపీ అనుబంధ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భనేని వంశీ సైతం ఈ నిర్ణ‌యాన్ని సీఎం జ‌గ‌న్ పున‌స‌మీక్షించుకోవాల‌ని విన్న‌వించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల సైతం త‌న అన్న నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇలా పేర్లు మార్చుకుంటూ పోవ‌డం స‌రికాద‌ని తేల్చిచెప్పారు. మ‌రోవైపు తాము అధికారంలోకి వ‌చ్చిన మ‌రుస‌టి రోజే
ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి అదే పేరును పెడ‌తామ‌ని ఇప్ప‌టికే టీడీపీ నేత‌లు స్ప‌ష్టం చేశారు.

కాగా  పోల‌వరం ఎత్తు పెంచాల‌ని ఏపీ ప్ర‌భుత్వం, త‌గ్గించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న డిమాండ్ల‌పైన కూడా వైఎస్ ష‌ర్మిల స్పందించారు. కృష్ణా, గోదావ‌రిల‌కు సంబంధించి నీటి బోర్డులు ఉన్నాయ‌ని.. అవి తేలుస్తాయ‌ని.. ప్ర‌భుత్వాల కొట్లాట ఎందుక‌న్నారు.

అదేవిధంగా త‌న‌కు ఉత్త‌ర తెలంగాణ‌, ద‌క్షిణ తెలంగాణ అని తేడాలు లేవ‌న్నారు. వైఎస్సార్ ప్ర‌జ‌లంద‌రినీ ప్రేమించార‌ని, తెలుగువారంద‌రినీ ఇష్ట‌ప‌డ్డార‌ని కొనియాడారు. ఆయ‌న సంక్షేమ పాల‌న‌ను తెలంగాణ‌లో తేవ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు.

ఇప్పుడు ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. యూనివ‌ర్సిటీకి పేరు మార్పుపై సొంత చెల్లెలు నుంచే జ‌గన్‌కు మ‌ద్దతు క‌రువు అవ్వ‌డంతో ప్ర‌తిప‌క్షాలు ఇదే అస్త్రంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని మ‌రింత ఇరుకున పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.