Begin typing your search above and press return to search.

షర్మిల ఫిర్యాదు...నెటిజ‌న్ల‌కు పోలీసుల అనూహ్య ట్విస్ట్‌ లు

By:  Tupaki Desk   |   20 Jan 2019 4:58 AM GMT
షర్మిల ఫిర్యాదు...నెటిజ‌న్ల‌కు పోలీసుల అనూహ్య ట్విస్ట్‌ లు
X
సోష‌ల్ మీడియా వేదిక‌గా చెల‌రేగిపోయే నెటిజ‌న్లు ఇక‌నుంచి త‌మ `చేతి దురుసు`కు అడ్డుక‌ట్ట వేసుకోవాల్సిందే. ఎదుటివారిని ఇబ్బంది పెట్టేలా ఉన్న‌ప్ప‌టికీ....తాము అనుకున్న‌ది పోస్ట్ చేసే కొంద‌రు ఇబ్బంది ప‌డుతున్న‌ట్లే...దానిపై కామెంట్లు చేసే వారు కూడా క‌ష్టాల పాలు అవ‌డం ఖాయం!! ఔను. నెట్టింట ఇష్టం వ‌చ్చిన‌ట్లు కామెంట్లు చేసే వారికి తాజా ఎపిసోడ్ ద్వారా షాక్ ఎదుర‌వుతోంది. వైఎస్‌ షర్మిలపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని సైబర్‌ క్రైం పోలీసులు జల్లెడ‌పట్టి మరీ వెతుకుతున్నారు. అభ్యంత‌ర‌క‌ర వీడియోలు పోస్ట్ చేసిన వారినే కాకుండా వాటిపై కామెంట్లు చేసిన వారిని కూడా పోలీసులు వ‌ద‌ల‌డం లేదు.

పోలీసులు ఇప్పటి వరకు యూట్యూబ్‌ లో 60 వీడియో లింకులను గుర్తించారు. అయితే అవి ఏఏ యూట్యూబ్‌ ఛానల్స్‌ కు సంబంధించినవో తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు ఫేస్‌ బుక్‌, ఇతర సోషల్‌ మీడియా సైట్లలోనూ పోస్టులు పెట్టిన 15 మందిని పోలీసులు గుర్తించారు. వీరిలో శుక్రవారం ముగ్గరిని అదుపులోకి తీసుకుని విచార‌ణ చేసిన పోలీసులు శనివారం మరో ముగ్గరిని విచారించారు. అనంతరం వారందరినీ నిందితులుగా పేర్కొంటూ సీఆర్పీ సీ 41 ( ఏ ) క్రింద నోటీసులు జారీ చేశారు. త్వరలో మరికొంత మందికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదిలావుంటే నోటీసులు అందుకున్న వారంతా తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, వీరిలో ఐదుగురు హైదరాబాద్‌ లో స్థిరపడి సొంతంగా యూట్యూబ్‌ ఛానల్స్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే షర్మిల ఫిర్యాదు నేపథ్యంలో చాలా మంది కంటెంట్‌ను డిలీట్‌ చేశారని, అయితే అప్పటికే వీళ్లు పోస్టు చేసిన కంటెంట్‌ కు సంబంధించిన ఆధారాలు పోలీసులకు చేరినట్లుగా తెలుస్తోంది.

ఈ ద‌ర్యాప్తులో సీసీఎస్‌ పోలీసులు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విశ్వ‌సనీయ‌వ‌ర్గాల స‌మాచారం. కేవలం కంటెంట్‌ ను పోస్టుచేసిన వాళ్లనే కాదు..కామెంట్లు పెట్టిన వాళ్లను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారని స‌మాచారం. ఫేస్‌ బుక్‌ లో, గూగుల్‌ లో చాలా మంది ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి..వీడియోల కింద కామెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై త‌గు రీతిలో స్పందించేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. అకౌంట్‌ ఎలా క్రియేట్‌ చేశారు..? అకౌంట్‌ క్రియేట్‌ చేసే సమయంలో ఏఏ మెయిల్‌ ఐడి, ఫోన్‌ నెంబర్‌ లు ఇచ్చారనే అంశాలతో పాటు పోస్టులు అప్‌ లోడ్‌ చేసే సమయంలో ఏఏ ఐపి అడ్రస్‌ ద్వారా ఇంటర్‌ నెట్‌ ను వినియోగించారనే వివరాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే తగిన సమాచారం కోసం యూట్యూబ్‌, ఫేస్‌ బుక్‌ పోలీసులు లేఖలు రాయగా, కొన్నింటికి సంబంధించిన ఆధారాలు ఆయా సంస్థలు అందజేసినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్‌ లు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. పోలీసుల దూకుడుతో స‌ద‌రు వ్య‌క్తుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.