Begin typing your search above and press return to search.

జగన్ తో కలిసినా కన్నీరు ఆగలేదని షర్మిల ఎమోషనల్

By:  Tupaki Desk   |   2 Sep 2021 11:30 AM GMT
జగన్ తో కలిసినా కన్నీరు ఆగలేదని షర్మిల ఎమోషనల్
X
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా పాత పగలు అన్నీ మరిచిపోయి అన్నా చెల్లెలు జగన్-షర్మిల తండ్రికి ఇడుపులపాయలో కలిసి నివాళులర్పించారు. కొంతకాలంగా ఉన్న గ్యాప్ ను ఈసారి వదిలేసి ఒకే వేదిక మీద కనిపించి విభేదాలు లేవని చాటారు. ప్రార్థనల్లో పాల్గొన్నారు. కానీ జగన్, షర్మిల వేదికపై ఒకరిని ఒకరు పలకరించుకున్న సందర్భం మాత్రం కనిపించలేదు.

వైఎస్ఆర్ కు నివాళి వేళ అందరూ ముభావంగానే కనిపించారు. నాటి ఆత్మీయతలు, పలకరింపులు ఆలింగనాలు కనిపించలేదు. జగన్ పక్కనే చెవిరెడ్డి, మామ రవీంద్రనాథ్ రెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కూర్చున్నా కూడా షర్మిలను పలకరించుకోలేదు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఎవరికి వారు తమను పలకరించిన వారితో కలిసి మాట్లాడకుండా వెళ్లిపోయారు.

-షర్మిల ఎమోషనల్ ట్వీట్ వైరల్
నివాళి కార్యక్రమం ముగిసిన వెంటనే షర్మిల ఒక ఘాటు ట్వీట్ చేశారు. అందులో ఎమోషనల్ అయ్యారు. 'ఒంటరి దానినైనా విజయం సాధించాలని,అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ అండ్ మిస్ యూ డాడ్' అంటూ తాను ఒంటరిని అన్న మెసేజ్ ను అందరికీ పంచడం చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్ లో తాను ఒంటరిగా ఫీలవుతున్నాననే విషయాన్ని ట్వీట్ రూపంలో షర్మిల చెప్పకనే చెప్పడం విశేషం.

-జగన్ సైతం ట్వీట్.. తండ్రిని గుర్తుచేస్తూ..
ఇక ఇదే సమయంలో తండ్రి వైఎస్ కు నివాళి అర్పిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశఆడు. 'నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లు అయినా జనం మనిషిగా తమ ఇంట్లోని సభ్యుడిగా నేటికి జన హృదయాల్లో కొలువై ఉన్నావ్.. చిరునవ్వులు చిందించే రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ.. చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది ' అని వైఎస్ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతానని చెప్పకనే చెబుతోంది. ఈ సమయంలో జగన్ రాజకీయంగా ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే షర్మిలకు దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్ జన్మదినం నాడు అసలు షర్మిల ఉన్న సమయంలోనూ ఘాట్ వద్దకు వెళ్లడానికి కూడా జగన్ సంశయించారు. ఈరోజున వెళ్లినా దూరంగానే వ్యవహరించడంతో కేవలం బయట వారి కోసం మాత్రమే అన్నా చెల్లెల్లు జగన్, షర్మిల ఇలా వైఎస్ఆర్ కు నివాళి వేళ ఇలా వ్యవహరించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

షర్మిల ట్వీట్

https://twitter.com/realyssharmila/status/1433291320601182210