Begin typing your search above and press return to search.

వైఎస్ ష‌ర్మిళ ఆగ్ర‌హం!..వికృత ప్ర‌చారంపై పోలీస్ కంప్లైంట్‌!

By:  Tupaki Desk   |   14 Jan 2019 10:36 AM GMT
వైఎస్ ష‌ర్మిళ ఆగ్ర‌హం!..వికృత ప్ర‌చారంపై పోలీస్ కంప్లైంట్‌!
X
తెలుగు నేల‌పై చెల‌రేగుతున్న దుష్ఠ రాజ‌కీయాల కార‌ణంగా దివంగ‌త‌ సీఎం - మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ఫ్యామిలీ మ‌రోమారు రోడ్డెక్కాల్సి వ‌చ్చింది. సినీ హీరో ప్ర‌భాస్‌ తో వైఎస్ త‌న‌య‌ - వైసీపీ అధినేత సోద‌రి వైఎస్ ష‌ర్మిళ‌కు సంబంధం అంట‌గ‌డుతూ రెచ్చిపోయిన కొన్ని వ‌ర్గాలు... ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ మ‌రోమారు పేట్రేగిపోయాయి. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ ను అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ త‌ర‌హా ప్ర‌చారానికి తెర లేపుతున్నట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. జ‌గ‌న్ సుదీర్ఘ పాద‌యాత్ర ముగించిన సంద‌ర్భంగా శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి స‌మ‌ర శంఖం పూరించారు. ఆ వెంట‌నే రంగంలోకి దిగిపోయిన కొన్ని రాజ‌కీయ పార్టీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వికృత ప్ర‌చారానికి తెర తీశారు. 20-14లో ష‌ర్మిళ‌పై వ‌చ్చిన పుకార్ల‌నే ఆధారం చేసుకుని తాజాగా అదే త‌ర‌హా వికృత ప్ర‌చారానికి దిగారు. ఈ త‌ర‌హా ప్ర‌చారంపై గ‌తంలోనూ ప‌త్రికా ప్ర‌క‌ట‌నతో స‌వివ‌రంగా వివ‌ర‌ణ ఇస్తూ... ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌ల‌పై విరుచుకుప‌డ్డారు. త‌న కుటుంబాన్ని రాజ‌కీయంగా అడ్డుకోలేక‌... ఇలా దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని కూడా నాడు ఆమె ఆరోపించారు. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ కూడా వైఎస్ ఫ్యామిలీకి చెందిన మ‌హిళ‌తో త‌న‌కు సంబంధం ఉందంటూ ప్ర‌చారం జ‌ర‌గ‌డంపై విచారం వ్య‌క్తం చేశారు. ఈ త‌రహా ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగానే ఖండించారు.

అప్ప‌టితో ఆ వివాదం స‌ద్దుమ‌ణ‌న‌గా... 2019 ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌న‌గానే నాటి దుష్ట శ‌క్తులు మ‌రోమారు రంగంలోకి దిగిపోయాయి. నాటి త‌ర‌హాలోనే ష‌ర్మిళ‌పై విష ప్ర‌చారం మొద‌లెట్టారు. అయితే ఈ త‌ర‌హా ప్ర‌చారంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ష‌ర్మిళ‌... ఈ సారి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌పై దుష్ప్ర‌చారానికి కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏకంగా హైద‌ర‌బాద్ పోలీసు క‌మిష‌న‌ర్ కు లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. భ‌ర్త అనిల్ కుమార్‌ - బాబాయి వైవీ సుబ్బారెడ్డి - వైసీపీ నేత‌లు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి - వాసిరెడ్డి ప‌ద్మ త‌దితరులు వెంట రాగా... స్వ‌యంగా క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి వ‌చ్చిన ష‌ర్మిళ క‌మిష‌న‌ర్‌ కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం అక్క‌డే మీడియాతో మాట్లాడిన ష‌ర్మిళ.. ఈ వికృత ప్ర‌చారంపై నిప్పులు చెరిగారు. కొన్ని దుష్ట శ‌క్తులు త‌న కుటుంబాన్ని రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌... త‌నపై అస‌త్య ప్ర‌చారం చేస్తూ... త‌న కుటుంబాన్ని మాన‌సికంగా ఇబ్బంది పెట్టేందుకు కంక‌ణం క‌ట్టుకున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. అస‌లు ప్ర‌భాస్ ను తాను ఎప్పుడూ క‌ల‌వ‌లేద‌ని - ఇప్ప‌టిదాకా అత‌డితో క‌నీసం మాట్లాడ‌ను కూడా లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. తానేమిటో త‌న‌కు తెలుస‌ని - త‌న భ‌ర్త‌కూ తెలుస‌ని - చివ‌ర‌కు త‌న దేవుడికి కూడా తానేంటో తెలుసున‌ని ఆమె వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కాస్తంత భావోద్వేగానికి గురైన ష‌ర్మిళ‌... *నా పిల్ల‌ల మీద ఒట్టేసి చెబుతున్నా. నాకు ప్ర‌భాస్ అనే వ్య‌క్తితో ఎలాంటి సంబంధం లేదు* అని ఆ దుష్ట ప్ర‌చారాన్ని తిప్పికొట్టారు.

అయినా ఈ విష ప్ర‌చారంపై తాను బ‌య‌ట‌కు ఎందుకు వ‌చ్చాన‌న్న విష‌యాన్ని వివ‌రించిన ష‌ర్మిళ‌... జ‌రిగేది అస‌త్య ప్ర‌చార‌మే అయినా - బాధితులు సైలెంట్‌ గా ఉంటే... నిజ‌మేన‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతుంద‌న్న కార‌ణంగానే తాను పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింద‌ని ఆమె చెప్పారు. ఇక ఈ విష ప్ర‌చారం వెనుక ఎవ‌రి హ‌స్త‌ముంద‌ని భావిస్తున్నార‌న్న ప్ర‌శ్న‌కు... టీడీపీపేనేన‌ని ష‌ర్మిళ చెప్పారు. త‌న సోద‌రుడు వైఎస్ జ‌గ‌న్‌ ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌... టీడీపీకి చెందిన నేత‌లు - చివ‌ర‌కు ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కూడా ఈ త‌ర‌హా కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆమె ఆరోపించారు. తాను ఓ మ‌హిళ‌ను అన్న క‌నీస ధ‌ర్మాన్ని కూడా టీడీపీ నేత‌లు మ‌రిచిపోతున్నార‌ని - వారిలా తాము అనుకుంటే... చంద్ర‌బాబు కుటుంబంలోని మ‌హిళ‌పైనా ఆరోప‌ణ‌లు చేయ‌గ‌ల‌మ‌ని, అయితే మ‌హిళాలోకం మీద ఉన్న గౌర‌వంతో ఆ ప‌నిచేయ‌డం లేద‌ని కూడా ష‌ర్మిళ చెప్పారు. త‌న‌పై జ‌రుగుతున్న ఈ దుష్ప్ర‌చారంపై త‌న‌తో పాటు మొత్తం మ‌హిళా లోకం కూడా గొంతెత్తాల్సి ఉంద‌ని కూడా ష‌ర్మిళ పిలుపునిచ్చారు.