Begin typing your search above and press return to search.

ష‌ర్మిల పార్టీలోకి ఈట‌ల‌... ఎందుకండి ఇలాంటి ఆఫ‌ర్లు?

By:  Tupaki Desk   |   9 Jun 2021 3:30 PM GMT
ష‌ర్మిల పార్టీలోకి ఈట‌ల‌... ఎందుకండి ఇలాంటి ఆఫ‌ర్లు?
X
మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ హాట్ హాట్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. సంచ‌ల‌న ప‌రిణామాల‌తో మంత్రి ప‌ద‌వి కోల్పోయిన ఆయ‌న టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి గుడ్ బై చెప్పేశారు. మ‌రోవైపు ఈట‌ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హుజురాబాద్‌లో ఉప ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైపోయింది. ఇంకోవైపు ఆయ‌న బీజేపీలో చేరిక‌పై అస్ప‌ష్ట‌త కనిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలోనే ఈట‌ల మంఉద‌కు ఓ`విచిత్ర‌మైన` ఆఫ‌ర్ వ‌చ్చింది. అదే వైఎస్ ష‌ర్మిల పార్టీ నుంచి ఆహ్వానం.

వైఎస్ షర్మిల తెలంగాణలో జూలై 8న‌ కొత్త పార్టీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ జెండా, అజెండా అన్నింటిని అదే రోజున ష‌ర్మిల ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ ప్ర‌క‌ట‌న కంటే ముందు కార్య‌క‌ర్త‌ల సమావేశం నిర్వ‌హించిన షర్మిల మాట్లాడుతూ తెలంగాణలో వైఎస్ పాల‌న వ‌ల్ల‌ లబ్ది పొందని ఇల్లే లేదని చెప్పుకొచ్చారు. వైఎస్ సంక్షేమ పాలనను గుర్తు తెచ్చేలా… తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టేలా త‌మ పార్టీ ఉంటుంద‌న్నారు. కార్యకర్తలకే మన పార్టీలో పెద్దపీట వేస్తాం అని భ‌రోసా ఇచ్చారు. పార్టీ ఎలా ఉండాలో కార్యకర్తలే చెప్పాలని కోరారు. కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులు అని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఈట‌ల రాజేంద‌ర్ గురించి ఆమె ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

కేసుల‌కు భ‌య‌ప‌డి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరుతున్నార‌ని వైఎస్‌ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారిపై కేసులు పెట్ట‌డం కామ‌న్ అయిపోయింద‌ని ఆమె ఆరోపించారు. ఈట‌ల త‌మ పార్టీలోకి వ‌స్తామంటే త‌ప్ప‌కుండా ఆహ్వ‌నిస్తామ‌ని ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల‌తో ఈ విష‌యంపై చర్చించ‌లేద‌ని అన్నారు. కాగా, ఈట‌ల వంటి సీనియ‌ర్ నేత‌, తెలంగాణ ఉద్య‌మకారుడి గురించి ష‌ర్మిల చేసిన కామెంట్లు చిత్రంగా ఉన్నాయ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.