Begin typing your search above and press return to search.

అదేంది షర్మిల.. ఒక్క మాటతో నాన్న పరువు తీసేశావే?

By:  Tupaki Desk   |   26 July 2022 4:57 AM GMT
అదేంది షర్మిల.. ఒక్క మాటతో నాన్న పరువు తీసేశావే?
X
మాట జారితే వచ్చిపడే ఇబ్బందుల గురించి మన పూర్వీకులు ఎప్పుడో సామెతల రూపంలో హెచ్చరించటం తెలిసిందే. ఏళ్లకు ఏళ్ల క్రితమే నోటి మాటకు ఉండే పవర్ ఎంతన్న విషయాన్ని చెప్పేశారు. అందుకే.. నోటి నుంచి వచ్చే మాటతో ఎదురయ్యే కష్టాలు అన్ని ఇన్ని కావు. కష్టాలన్నీ కట్టగట్టి మన మీద దాడి చేస్తున్న చందంగా అప్పుడప్పుడు పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలా రెడ్డికి. ఇప్పటికే తన తండ్రి కలల్ని కల్లలు చేయకుండా.. మరింతలా ఆయన ఆశయాల్ని తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ.. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయటం తెలిసిందే.

ఏ చిన్న అవకాశం లభించినా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా. .అప్పుడప్పుడు మంత్రి కేటీఆర్ పైనా ఘాటు విమర్శలు చేస్తుంటారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్న ఆమె.. పాదయాత్రను చేపట్టటం తెలిసిందే. అవకాశం వచ్చిన ప్రతిసందర్భంలోనూ కేసీఆర్ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పడుతున్న ఆమె.. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మరోసారి తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రదర్శించారు.

ఆగ్రహంతో కూడిన ఆవేశంతో చెలరేగిపోయిన ఆమె.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో మాట జారారు. జగనన్న బాణంగా గుర్తింపు పొందిన ఆమె.. తన అన్న జైలుకు వెళ్లినప్పుడు ఆయన స్థానే.. పాదయాత్ర బండిని నడిపించటం.. తన అన్న పార్టీని సంధించటమే కాదు.. తాను జగనన్న విడిచిన బాణాన్ని అంటూ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనంగా మారాయన్నది తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆమె నోటినుచి వచ్చిన మాట ఒకటి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ తెగ వైరల్ గా మారింది. తన తండ్రి కమ్ దివంగత మహానేత వైఎస్ ను ఉద్దేశించి ఆమె చేసిన మాటలకు ఒక్కొక్కరు ఒక్కోలాంట అర్థాన్ని తీస్తున్నారు. షర్మిల మాటల్ని టైపో మిస్టేక్ గా చూడాలని ఆమెను అభిమానిస్తున్న వారు చెబుతుంటే.. ఆమెను తప్పు పట్టే వారంతా మాత్రం.. ఇంతకాలం దాచిన నిజాలన్ని.. ఇంతకాలానికి భలేగా బయటకు వస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణలో 80 శాతం ప్రాజెక్టులన్ని కూడా మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పజెప్పటాన్ని ఆమె తప్పుపట్టారు. 'ఒకే వ్యక్తికి ఎందుకు కట్టబెడుతున్నారు? మోగా క్రిష్ణారెడ్డి తెలంగాణను దోచుకున్నారు. ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ఆమె స్థానం టాప్ త్రీలోకి వచ్చినట్లుగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్లకు ప్రాజెక్టుల్ని కట్టబెట్టారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కేసీఆర్.. ఇప్పుడు అదే అంశాన్ని ఇటీవల కాలంలో షర్మిల పదే పదే ప్రశ్నిస్తున్నారు.

'కొత్తవాళ్లకు కాంట్రాక్టులు ఎందుకు ఇవ్వటం లేదు? ఒక్కరే ప్రాజెక్టులు చేయాలా? తెలంగాణ వచ్చిందే మెగా క్రిష్ణారెడ్డి కోసమేనా? తెలంగాణను ఆయన చేతుల్లో పెట్టటం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నారు? ఒకే వ్యక్తికి 80 శాతానికి పైనే ప్రాజెక్టులు ఇవ్వటం ఏంటి? మెగా క్రిష్ణారెడ్డి దగ్గర రూ.70వేల కోట్ల బ్లాక్ మనీ ఉందని.. దానికి సంబంధించి రూ.12 వేల కోట్లు జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని జీఎస్టీ ఇంటెలిజెన్సు డైరెక్టర్ స్వయంగా పేర్కొన్నారు' అంటూ షాకింగ్ నిజాల్ని వెల్లడించారు.

మెగా క్రిష్ణారెడ్డి మాష్టారు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా మాట్లాడిన షర్మిల.. ఈ సందర్భంగా తన తండ్రి కమ్ దివంగత మహానేత వైఎస్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 'రాజశేఖర్ రెడ్డి ఒక్కరికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు. ఒక్కరి దగ్గరే అన్ని కమిషన్లు తీసుకోలేదు' అంటూ నోరు జారారు. రాజశేఖర్ రెడ్డిని అందరి మనిషన్న ఆమె.. "ఇప్పటి మాదిరి ఒక్కరినే వైఎస్ ప్రోత్సహించలేదు. ఇతర కాంట్రాక్టులు చేస్తున్న వారందరిని వైఎస్ ఎంకరేజ్ చేశారు. వైఎస్ ప్రోత్సాహంతో ఎంతో మందిని పారిశ్రామికవేత్తల్ని చేశారన్నారు. వైఎస్ చేసింది డెవలప్ మెంట్ అని.. కేసీఆర్ మాత్రం కరప్షన్ చేశారంటూ ఆరోపించారు. ఏమైనా.. తన తండ్రి గౌరవ మర్యాదల్ని దెబ్బ తీసేలా నోరు జారిన షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండ్రింగ్ గా మారాయి. తనపై వెల్లువెత్తుతున్న విమర్శలకు ఆమె ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.