Begin typing your search above and press return to search.

షర్మిలకు అంత సీనుందా ?

By:  Tupaki Desk   |   22 Aug 2021 5:32 AM GMT
షర్మిలకు అంత సీనుందా ?
X
'తొందరలో జరగబోతున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో వందమంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయిస్తాం'..ఇది తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్య. అధికారంలోకి వచ్చేస్తామనే భ్రమలో తెలంగాణాలో రాజకీయపార్టీ పెట్టిన షర్మిల ఇపుడు పార్టీ ఉనికిని చాటుకోవటం కోసమే అవస్తలు పడుతున్న సంగతి అందరు చూస్తున్నదే. ఇలాంటి నేపధ్యంలో హుజూరాబాద్ ఉపఎన్నికలు రాబోతున్నాయి.

ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ఇంకోవైపు కాంగ్రెస్ పావులు కదుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవిధంగా తెలంగాణాలో రాజకీయమంతా హుజూరాబాద్ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నది. ఇలాంటి పరిస్ధితుల్లో షర్మిల పార్టీని ఎవరు పట్టించుకోవటంలేదు. అందుకనే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసమంటు అక్కడక్కడ నిరాహారదీక్షలు చేస్తున్నారు. అయినా ఆమెకు రాజకీయంగా పెద్దగా మైలేజీ రావటంలేదు.

ఈ నేపధ్యంలోనే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధికి వ్యతిరేకంగా 100 మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయించబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆమె ప్రకటనను ఇతర రాజకీయపార్టీలేవి పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. షర్మిల చెప్పినట్లుగా అసలు ఆ పార్టీ తరపున వందమంది నిరుద్యోగులు నామినేషన్లు వేయటానికి రెడీగా ఉన్నారా ? అన్నదే డౌటు. కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బొమ్మను, పేరును చెప్పుకుని రాజకీయం చేయాలని షర్మిల భావిస్తున్నట్లున్నారు.

వైఎస్సార్ పేరు చెబితే కొన్ని ఓట్లు పడతాయోమో కానీ గెలిపించలేవు. ఎన్నికల్లో నలుగురు అభ్యర్ధులు గెలవాలంటే పార్టీలో బలమైన నేతలు చేరాలి. జిల్లాల్లో కనీసం తమ నియోజకవర్గంలో అయినా గట్టి నేతలని చెప్పుకునేంత స్ధాయిలోని నేతలుండాలి. వైఎస్సార్టీపీలో షర్మిల తప్ప జనాలందరికీ తెలిసిన రెండో నేతేలేరు. పైగా ఇందిరా శోభన్ లాంటి ఇద్దరు ముగ్గురు నేతలు కూడా పార్టీకి రాజీనామా చేసేసి బయటకు వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్ధితుల్లో వందమంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయిస్తామని, కేసీయార్ ను ఓడగొడతామని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.