Begin typing your search above and press return to search.

షర్మిలమ్మ లెక్కే వేరు : అన్న పేరెత్తి మరీ కేసీయార్ మీదకు.....?

By:  Tupaki Desk   |   23 July 2022 2:13 PM GMT
షర్మిలమ్మ లెక్కే వేరు : అన్న పేరెత్తి మరీ కేసీయార్ మీదకు.....?
X
వైఎస్సార్ ముద్దుల తనయ వైఎస్ షర్మిల కేసీయార్ సర్కార్ మీద విమర్శలు చేయాలీ అంటే నల్లెరు మీద బండిలా దూసుకువస్తారు. ఆమె ఎక్కడా ఎవరినీ అసలు స్పేర్ చేయరు. తన పార్టీకి తెలంగాణాలో ఎంతవరకూ జనాదరణ ఉందో తెలియదు కానీ కేసీయార్ సర్కార్ ని మాత్రం టార్గెట్ చేయడంతో ఆమె బాగా ముందుటున్నారు. ఇక భద్రాచలం ముంపునకు పోలవరం ప్రాజెక్ట్ కారణం అని ఈ మధ్యనే టీయారెస్ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన కామెంట్స్ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాయి.

దాని మీద కాంగ్రెస్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేసింది. కేసీయార్ సర్కార్ మీద విమర్శలు గుప్పించింది. అయితే వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ షర్మిలమ్మ లెక్కే వేరు అన్నట్లుగా లేట్ అయినా లేటెస్ట్ గా ఆమె చేసిన హాట్ కామెంట్స్ మాత్రం సంచలనం రేపాయి. అన్న పేరు తీసుకొచ్చి మరీ కేసీయార్ మీద సెటైర్ల జడివాన కురిపించారు.

ఆనాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ని తన ఇంటికి పిలిపించుకుని స్వీట్లు తినిపించినపుడు పోలవరం గుర్తుకురాలేదా కేసీయార్ అంటూ షర్మిల అడిగిన సూటి ప్రశ్న నిజంగా లాజిక్ తో కూడుకున్నదే. ఇక పోలవరం ప్రాజెక్ట్ భేష్ అంటూ నాడు కేసీయార్ పొగిడిన గతాన్ని ఆమె ఒక్కసారిగా గుర్తుకు తెచ్చారు. మరి నాడు లేని అభ్యంతరం ఇపుడు ఎందుకు దొరా అంటూ షర్మిల ఒక విధంగా గట్టిగానే తగులుకున్నారు అని చెప్పాలి.

నిజంగా షర్మిల అడిగిన పాయింట్స్ కాంగ్రెస్ నాయకులు ఎవరూ టచ్ చేయనివే. మరో వైపు చూస్త పొరుగు రాష్ట్రం సీఎం అంటూ జగన్ గురించి చెప్పారే తప్ప అన్న అని అనలేదు, దాంతో ఆమె పోలవరం విషయంలో తెలంగాణా చేస్తున్న యాగీ ఒప్పా తప్పా అని చెప్పకుండానే తెలివిగానే కేసీయార్ ని ఇరికించారని అంటున్నారు. భద్రాచలం కరకట్ట ఎత్తు పెంచి కడితే పోయేదానికి పోలవరం దాకా ఎందుకు అంటూ ఆమె మరో పాయింట్ ని లేవనెత్తారు ఆ పనిని 2008లో తన తండ్రి వైఎస్సార్ మొదలెట్టారని, ఎనిమిదేళ్ల కాలంలో కరకట్టను పూర్తి చేయడానికి కేసీయార్ కి తీరుబాటు లేకపోయిందా అని కూడా షర్మిల నిలదీశారు.

అంతే కాదు గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పి కేసీయార్ వెళ్ళిపోయారని కూడా ఆమె ఎద్దేవా చేశారు. వరద బాధితులకు ఇస్తామన్న పదివేల రూపాయలు ఏమయ్యాని ఆమె ప్రశ్నించారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ అంటూ భద్రాచలం జనాలను సాకులు చెప్పడం కాదు, ముంపు ప్రజలను ఆదుకునే శాశ్వత ప్రాజెక్ట్ ఏది ఉందో చెప్పాలి అని కూడా ఆమె కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బలి అయినట్లుగా భద్రాచలం జనాలను కూడా బలి పెడతారా అంటూ షర్మిలమ్మ కన్నెర్ర చేశారు.

మొత్తానికి షర్మిలమ్మ అన్న జగన్ పేరు తెచ్చి మరీ కేసీయార్ ని అడిగేశారు. అలాగే ఆయన్ని ఇరకాటంలో పెట్టేసారు. ఏపీ సీఎం తెలంగాణా సీఎం ల మధ్య గుడ్ రిలేషన్స్ ఉన్నాయన్న సత్యాన్ని కూడా లోకానికి చెప్పే ప్రయత్నం చేశారు. ఒక విధంగా లాజిక్ తో కూడా ఈ విమర్శలకు టీయారెస్ ఏ విధంగా జవాబు ఇస్తుందో చూడాలి.