Begin typing your search above and press return to search.

ష‌ర్మిల‌కు ఇక మిగిలింది అదేనా?

By:  Tupaki Desk   |   6 Sep 2021 7:30 AM GMT
ష‌ర్మిల‌కు ఇక మిగిలింది అదేనా?
X
తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తేవ‌డ‌మే ల‌క్ష్యంగా రాజ‌కీయాల్లో అడుగుపెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించి జులై 8న త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన ఆయ‌న కూతురు ష‌ర్మిల రెండు నెల‌లు కూడా పూర్తి కాక‌ముందే ఎన్నో స‌వాళ్లు ఎదుర్కుంటున్నారు. పొలిటిక‌ల్ మైలేజీ కోసం నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. నిరుద్యోగ స‌మ‌స్య‌ను నెత్తికొత్తెకున్న ఆమె దాని ద్వారా అనుకున్న ప్ర‌యోజ‌నాన్ని పొంద‌లేక‌పోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవ‌ల వైఎస్ 12వ వ‌ర్థంతి సందర్భంగా ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌మ్మ ఏర్పాటు చేసిన సంస్మ‌ర‌ణ స‌భ త‌న కూతురు ష‌ర్మిల‌కు ఏ విధంగానూ ఉప‌యోగ‌ప‌డ‌లేక‌పోయింది. ష‌ర్మిల‌కు రాజ‌కీయంగా మ‌ద్ద‌తు క‌ల్పించే ఉద్దేశంతోనే విజ‌య‌మ్మ ఆ స‌భ నిర్వ‌హించార‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

తెలంగాణ‌లో అడుగుపెట్ట‌గానే అధికారంలోకి వ‌స్తానంటూ ష‌ర్మిల హ‌డావుడి చేయ‌డం ఆమెకు మైన‌స్‌గా మారింద‌ని రాజకీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఎందుకంటే ఆమె ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుసు కానీ ప్ర‌త్యేకంగా గుర్తింపు అంటూ ఇక్క‌డ లేదు. ఇప్పుడు అన్న జ‌గ‌న్ మీద కోపంతో తెలంగాణ‌లో పార్టీ పెట్టింద‌నే అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. తెలంగాణ కోడ‌లిగా ముద్రతో రాజ‌కీయంగా ఎద‌గాల‌ని ఆమె ప్ర‌య‌త్నిస్తున్నా ఆమెను బ‌య‌టి వ్య‌క్తిగానే చూసే ప‌రిస్థితుల్లో మాత్రం ఇంకా మార్పు రాలేద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ఆమెతో క‌లిసి న‌డిచేందుకు కీల‌క నేత‌లెవ‌రూ ముందుకు రాలేదు. ఇప్పుడేమో పార్టీలో ఉన్న ప్ర‌ధాన నాయ‌కులు ఒక్కొక్క‌రిగా ష‌ర్మిల‌కు దూర‌మ‌వుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ టీపీ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్ల‌మెంట్ క‌న్వీన‌ర్ ప‌ద‌వికి ఇబ్ర‌హీం రాజీనామా చేశారు. పార్టీలో త‌గిన ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌ని ఆయ‌న దూర‌మైన‌ట్లు స‌న్నిహితులు చెప్తున్నారు. ఇప్ప‌టికే చేవెళ్ల ప్ర‌తాప్ రెడ్డి ఇందిరా శోభ‌న్ లాంటి కీల‌క‌మైన నేత‌లు పార్టీకి వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే.

ఇన్ని అడ్డంకులు ఇబ్బందుల మ‌ధ్య ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ష‌ర్మిల కోసం ప‌ని చేసేందుకు రంగంలోకి దిగుతున్నార‌ని ఇటీవ‌ల వ‌చ్చిన వార్త ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కానీ తాజాగా ఆయ‌న కొంత కాలం పాటు రాజ‌కీయాల‌కు పార్టీల‌కు దూరంగా ఉండాల‌ని అనుకుంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఈ నేప‌థ్యంలో ఇక ష‌ర్మిల ముందు ఒకే మార్గం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అదే పాద‌యాత్ర‌. రాజ‌కీయంగా ఆమెకు మైలీజీ రావాలంటే పాద‌యాత్ర ఒక్క‌టే మార్గంగా క‌నిపిస్తోంది. రాష్ట్రంలో వంద రోజుల పాద‌యాత్ర చేస్తాన‌ని పార్టీ ఆవిర్భావం రోజే ష‌ర్మిల ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 18 నుంచి సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌నున్న‌ట్లు చెప్పారు. గ‌తంలో పాద‌యాత్ర‌లు చేసిన ఎంతో మంది నాయ‌కులు ప్ర‌జ‌ల అభిమానాన్ని పొందారు. అంతెందుకు ఏపీలో అన్న కోసం పాద‌యాత్ర చేసిన ష‌ర్మిల వైసీపీ అధికారంలోకి రావ‌డానికి కీల‌క పాత్ర పోషించారు.

ఈ నేప‌థ్యంలో పాద‌యాత్ర చేయ‌డం ష‌ర్మిల‌కు కొత్తేమీ కాదు. త‌న తండ్రి దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి బాట‌లో సాగుతున్న ఆమె ఆయ‌న‌లాగే రంగారెడ్ది జిల్లా చేవెళ్ల నుంచే యాత్ర ప్రారంభించ‌నున్నారు. మ‌రోవైపు 2012లో అన్న కోసం ఆమె చేప‌ట్టిన యాత్ర‌ను అక్టోబ‌ర్ 18నే ఆమె ప్రారంభించారు. దీంతో తండ్రి పాద‌యాత్ర చేప‌ట్టిన ప్రాంతం అన్న కోసం పాద‌యాత్ర మొద‌లెట్టిన తేదీ క‌లిసి రావ‌డం శుభ‌సూచ‌కంగా ఆమె భావిస్తున్నారు. మ‌రి ఈ పాద‌యాత్ర ఆమెకు ఏ మేర‌కు క‌లిసి వ‌స్తుందో చూడాలి. ఆమె పొలిటికల్ కెరీర్ ఎలాంటి మ‌లుపు తిర‌గ‌నుందో ఈ పాద‌యాత్ర‌తో తేలిపోనుంద‌ని నిపుణులు అంటున్నారు.