Begin typing your search above and press return to search.

ష‌ర్మిల‌కు ఒరిగేదేమిటీ?

By:  Tupaki Desk   |   21 Oct 2021 3:30 AM GMT
ష‌ర్మిల‌కు ఒరిగేదేమిటీ?
X
త‌న తండ్రి దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి.. త‌న అన్న ప్ర‌స్తుత ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి న‌డిచిన బాట‌లోనే సాగేందుకు వైఎస్ ష‌ర్మిల సిద్ధ‌మ‌య్యారు. అధికారంలోకి రావ‌డానికి త‌మ వాళ్ల‌కు ఎంతో క‌లిసొచ్చిన పాద‌యాత్ర‌నే ఇప్పుడు ష‌ర్మిల న‌మ్ముకున్నారు. అక్టోబ‌ర్ 20న తెలంగాణ‌లో ఆమె పాద‌యాత్ర మొద‌లెట్టారు. గ‌తంలో త‌న అన్న అధికారంలోకి రావ‌డం కోసం ఏపీలో పాద‌యాత్ర చేసిన ష‌ర్మిల‌.. ఇప్పుడు త‌న సొంత పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డం కోసం మ‌రోసారి అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణ‌లో ఒంట‌రి పోరాటం చేస్తున్న ఆమెకు ఈ పాద‌యాత్ర వ‌ల్ల ఒరిగేదేమిట‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఏపీలో త‌న అన్న త‌న‌కు రాజ‌కీయ ప్రాధాన్య‌త క‌ల్పించ‌డం లేద‌ని అన్న‌తో విభేధాల కార‌ణంగా తెలంగాణ‌కు వ‌చ్చి జులై 8న త‌న తండ్రి పేరులో వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆమె స్థాపించారు. ఆరంభంలో కొంత‌మంది పేరున్న నాయ‌కుల‌తో పార్టీ బాగానే హ‌డావుడి చేసింది. ముఖ్యంగా నిరుద్యోగ స‌మ‌స్య‌ను నెత్తికెత్తుకున్న ష‌ర్మిల ప్ర‌తి మంగ‌ళ‌వారం నిర‌హార దీక్ష చేయ‌డంతో పాటు ఉద్యోగాలు భ‌ర్తీ చేయాలంటూ సీఎం కేసీఆర్‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తోంది. కానీ ఆ త‌ర్వాత పార్టీలోని కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రిగా దూరం కావ‌డంతో ఢీలా ప‌డింది. ఇప్పుడామె పార్టీలో ష‌ర్మిల త‌ర్వాత చెప్పుకోద‌గ్గ నాయ‌కులే లేరు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో రాష్ట్రంలో సుదీర్ఘ పాద‌యాత్ర‌కు ఆమె శ్రీకారం చుట్టారు.

సుమారు 400 రోజుల పాటు సాగే ఈ పాద‌యాత్ర‌లో 4 వేల కిలోమీట‌ర్లు చుట్టేయాల‌ని ఆమె ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ మిన‌హా రాష్ట్రంలోని 16 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లోని 90 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ పాద‌యాత్ర సాగుతుంది. ఏడాదికి పైగా సాగే ఈ పాద‌యాత్ర కోసం ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్పాటు సాగుతున్నాయి. త‌న తండ్రి వైఎస్ గ‌తంలో పాద‌యాత్ర మొద‌లెట్టిన చేవెళ్ల నుంచే త‌న పాద‌యాత్ర ప్రారంభించిన ష‌ర్మిల తిరిగి అక్క‌డే దాన్ని ముగించ‌నుంది. అయితే రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి స‌రైన గుర్తింపే లేదు. దాన్ని ఓ రాజ‌కీయ పార్టీగా కూడా ఎవ‌రూ చూడ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి కార్య‌క‌ర్త‌లు లేరు. వైఎస్ మీద అభిమానం ఉన్న వాళ్లు ష‌ర్మిల‌కు తోడుగా నిలిచే అవ‌కాశం ఉంది. కానీ వాళ్ల సంఖ్య త‌క్కువే. ఇక మ‌రోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పైనే రాష్ట్ర ప్ర‌జ‌ల ఫోక‌స్ ఉంది. అక్క‌డి ఉప ఎన్నిక రాష్ట్రమంతా రాజ‌కీయ వేడిని ర‌గిల్చింది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ పోటీ నుంచి త‌ప్పుకున్న ష‌ర్మిల చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల ఏ మేర‌కు హాజ‌ర‌వుతార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. ఆమె పాద‌యాత్ర విజ‌య‌వంతం అవుతుంద‌ని కూడా క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఓ చోట ష‌ర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష కోసం అడ్డా కులీల‌కు డ‌బ్బులు ఇస్తామ‌ని తెప్పి ర‌ప్పించారు. కానీ అనుమ‌తి లేద‌ని పోలీసులు దీక్ష‌ను భ‌గ్నం చేయ‌డంతో ఆ అడ్డాకులీల‌కు డ‌బ్బులు ఇవ్వ‌కుండానే నాయ‌కులు వెళ్లిపోయార‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీక్ష‌కే ప్ర‌జ‌ల‌ను స‌మీక‌రించ‌లేని నాయ‌కులు.. ఇక పాద‌యాత్ర‌కు ఏ మేర జ‌నాల‌ను తీసుకు వ‌స్తార‌న్న‌ది సందేహ‌మే. రాష్ట్రంలో ప్ర‌స్తుతం అధికార టీఆర్ఎస్‌కు బీజేపీ, కాంగ్రెస్ స‌వాల్ విసురుతున్నాయి. ఈ మ‌ధ్య‌లో ష‌ర్మిల పార్టీ నిల‌దొక్కుకోవ‌డం క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాస్తో కూస్తో క్యాడ‌ర్‌ బ‌లం ఉన్న బండి సంజ‌య్ పాద‌యాత్ర‌నే భారీ స్థాయిలో విజ‌య‌వంతం కాలేద‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల వ‌స్తారో లేదో చూడాలి.