Begin typing your search above and press return to search.

శ‌వ రాజ‌కీయం ష‌ర్మిల‌కు క‌లిసొస్తుందా?

By:  Tupaki Desk   |   22 Sep 2022 1:30 AM GMT
శ‌వ రాజ‌కీయం ష‌ర్మిల‌కు క‌లిసొస్తుందా?
X
తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తెస్తానంటూ పార్టీ పెట్టి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌. ప్ర‌స్తుతం ప్ర‌జాప్ర‌స్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్, ఆయ‌న కుమారుడు కేటీఆర్, కుమార్తె క‌విత, మంత్రులు ఇలా ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌కుండా మాట‌ల దాడికి పాల్ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ష‌ర్మిల మాట‌లు కూడా హ‌ద్దులు దాటుతున్నాయ‌ని, విమ‌ర్శ‌ల స్థానంలో తిట్లు చోటు చేసుకుంటున్నాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

త‌న పార్టీని, త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ష‌ర్మిల‌లో అస‌హ‌నం పెరిగిపోతోంద‌ని అంటున్నారు. తాను పార్టీ పెట్ట‌గానే పెద్ద నేత‌లు త‌న పార్టీలో చేర‌తార‌ని ష‌ర్మిల భావించారు. ఒక‌ప్ప‌టి వైఎస్సార్ అనుచ‌రులంతా తీర్థం పుచ్చుకుంటార‌ని త‌లిచారు. అయితే తానొక‌టి త‌లిస్తే.. దైవం ఒక‌టి త‌లిచిన‌ట్టు ఒక్క పేరున్న నేత ష‌ర్మిల పార్టీలో చేర‌లేదు. అస‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో కేఏ పాల్ చూసిన‌ట్టు ష‌ర్మిల‌ను కూడా ఆట‌లో అర‌టిపండులాగానే చూస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో త‌న అన్న వైఎస్ జ‌గ‌న్ చేసిన‌ట్టే అన్న‌బాట‌లోనే పాద‌యాత్ర సైతం చేస్తున్నారు. అయినా ష‌ర్మిల యాత్ర‌ను సీరియ‌స్‌గా తీసుకున్న నాథుడు లేరని అంటున్నారు. ష‌ర్మిల వ్య‌వ‌హారాన్ని అధికార పార్టీ టీఆర్ఎస్, ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ పూర్తిగా లైట్ తీసుకున్నాయి. మీడియా సైతం ఆమెకు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదు.

దీంతో రూటు మార్చిన ష‌ర్మిల దూష‌ణ‌ల ప‌ర్వాన్ని ఎత్తుకున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ నేత‌లు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను తిడుతున్న‌ట్టు, దూషిస్తున్న‌ట్టు ష‌ర్మిల కూడా వాడు వీడు అంటూ టీఆర్ఎస్ నేత‌ల‌పై విరుచుకుపడుతున్నార‌నే విమ‌ర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మీడియా అటెన్ష‌న్ కోస‌మే ఇలా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఆమెపై ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా శ‌వ‌రాజ‌కీయాలు కూడా మొద‌లుపెట్టార‌ని మండిప‌డుతున్నారు. 2009లో ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణించిన త‌న తండ్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణాన్ని హ‌త్య‌గా చిత్రీక‌రిస్తూ కొత్త డ్రామా మొద‌లుపెట్టార‌ని అంటున్నారు. గ‌తంలో సానుభూతి కోసం వైఎస్ జ‌గ‌న్ సైతం త‌న తండ్రిని చంపించార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వైఎస్సార్ మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక వేల‌మంది మ‌ర‌ణించారంటూ వారి కుటుంబాల‌ను ఓదారుస్తానంటూ ఓదార్పు యాత్ర కూడా చేశారు. చాలాకాలం పాటు త‌న తండ్రి చావు చుట్టే రాజ‌కీయాలు చేశార‌ని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు త‌న అన్న‌బాట‌లోనే ష‌ర్మిల కూడా శ‌వ‌రాజ‌కీయాలు చేస్తోంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తెలంగాణ‌లో నీ తండ్రిని చంపిన‌వారెవ‌రూ అంటూ ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు. నీ తండ్రి చ‌నిపోయింది ఎక్క‌డ‌?.. నువ్వు ప్ర‌శ్నించేది ఎవ‌రిని అంటూ నిల‌దీస్తున్నారు. నీ అన్న ఇలాంటి శ‌వ రాజ‌కీయాలు చేసి ఏపీ ముఖ్య‌మంత్రి అయ్యాడు.. ఇప్పుడు నీ వంతా అంటూ ష‌ర్మిల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ష‌ర్మిల మాత్రం ప్ర‌జ‌ల్లో త‌న పేరు నానాల‌న్నా, మీడియా అటెన్ష‌న్ ఉండాల‌న్నా ఇలాంటివే క‌రెక్టు అని భావిస్తున్నట్టు స‌మాచారం. ఓవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌ను దూషించ‌డం.. వారు తిరిగి ఏమైనా అంటే మ‌హిళ అని కూడా చూడ‌కుండా త‌న‌ను తిడుతున్నార‌ని ఏడ‌వ‌డం.. త‌ద్వారా ప్ర‌జ‌ల సానుభూతి పొంద‌డం.. ఇదే ష‌ర్మిల న‌యా రాజ‌కీయ‌మ‌ని నిప్పులు చెరుగుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.