Begin typing your search above and press return to search.

రాజ‌న్న అండ‌గా.. వ్యూహ‌క‌ర్త తోడుగా..

By:  Tupaki Desk   |   3 July 2021 8:36 AM GMT
రాజ‌న్న అండ‌గా.. వ్యూహ‌క‌ర్త తోడుగా..
X
రాజకీయం అంతిమ ల‌క్ష్యం అధికారం. అది సాధించాలంటే విజ‌య‌మే గీటురాయి. అది ద‌క్కాలంటే.. కేవ‌లం ప్ర‌జాభిమానం ఉంటే స‌రిపోదు. ఎన్నో వ్యూహాలు ర‌చించాలి. ప్ర‌త్య‌ర్థుల ఎత్తుల‌కు పై ఎత్తులు వేయాలి. అప్పుడే.. గెలుపు జెండా ఎగరేయ‌డం సాధ్య‌మ‌వుతుంది. అయితే.. ఒక్క‌రి ఆలోచ‌న ప్ర‌తిసారీ స‌రైన‌ది కాక‌పోవ‌చ్చు. న‌లుగురితో చర్చిస్తేనే.. మేలైన నిర్ణ‌యం ఉద్భ‌విస్తుంది. కానీ.. పార్టీలోని నాయ‌కుల‌తో చ‌ర్చిస్తే.. ఫ‌లితం ఎలా వ‌స్తుందో అధినేత‌ల‌కు బాగా తెలుసు. త‌మ ప్రాప‌కం కోసం.. చుట్టూ చేరి ఆహా.. ఓహో అనే బ్యాచే ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి వాళ్ల‌తో వ్యూహాలు అంటే.. పుట్టి ముంచుకోవ‌డ‌మే. అందుకే.. దేశ రాజ‌కీయాల్లో వ్యూహ‌క‌ర్త‌ల ప్రాధాన్యం పెరుగుతూ వ‌స్తోంది.

దేశంలోనే దిగ్గ‌జ వ్యూహ‌క‌ర్త‌గా పేరుగాంచిన ప్ర‌శాంత్ కిషోర్.. ట్రాక్ రికార్డే ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తుంది. 2014లో మోడీని, 2019లో జగన్ ను, తాజాగా బెంగాల్లో దీదీని గెలిపించడంలో పీకే పాత్ర ఎంత అనేది అంద‌రికీ తెలిసిందే. దీంతో.. ప్ర‌తీ పార్టీకి ఎన్నిక‌ల వేళ‌ వ్యూహ‌క‌ర్త అనివార్యం అనే ప‌రిస్థితి వ‌చ్చేసింది. వీళ్ల‌కు ఎలాంటి మొహ‌మాటాలు ఉండ‌వు. అవ‌స‌రం లేదు కూడా. ఉన్న విష‌యం ఉన్న‌ట్టుగా చెబుతారు. లోపాలు వివ‌రిస్తారు.. బ‌లాల‌ను ప‌రిచయం చేస్తారు. అంతిమంగా గెలుపు మెట్టు ఎలా ఎక్కాలో వివ‌రిస్తారు.

ఇలాంటి వ్యూహ‌క‌ర్త‌ను పార్టీ ప్రారంభించ‌డానికి ముందే తోడు తెచ్చుకున్నారు వైఎస్ ష‌ర్మిల‌. ఈ నెల 8న వైఎస్ జ‌యంతి సంద‌ర్భంగా పార్టీని అధికారికంగా ప్ర‌క‌టించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అయితే.. వ్యూహ‌క‌ర్త‌ను కూడా ఇప్ప‌టికే సిద్ధం చేసుకున్నార‌ట‌. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం నుంచి.. 2024లో ఎన్నిక‌ల్లో పోటీ చేసే వ‌ర‌కు ఈ వ్యూహ‌క‌ర్త వెన్నంటే ఉంటార‌ని తెలుస్తోంది. ఇంత‌కీ.. ఆ వ్యూహ‌క‌ర్త ఎవ‌రంటే.. పేరు ప్రియ‌.

త‌మిళ‌నాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్ర‌న్ కుమార్తె. ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ లో గ‌తంలో వ‌ర్క్ చేసింద‌ని చెబుతున్నారు. త‌మిళ‌నాట ఓ మీడియాను కూడా న‌డుపుతున్న ఈమె.. ష‌ర్మిల విజ‌యానికి సంబంధించిన‌ వ్యూహాలు ర‌చించ‌బోతోంద‌ట‌. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంత‌? ఆమె వ్యూహాలు తెలంగాణ‌లో ఏ మేర‌కు స‌క్సెస్ అవుతాయి? ష‌ర్మిల రాజ‌కీయానికి ఎలాంటి బాట‌లు ప‌రుస్తుంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు ముందు ముందు స‌మాధానాలు రానున్నాయి.