Begin typing your search above and press return to search.

తెలంగాణలో పాదయాత్రకు షర్మిల సైతం రె‘ఢీ’

By:  Tupaki Desk   |   7 Aug 2021 12:42 PM GMT
తెలంగాణలో పాదయాత్రకు షర్మిల సైతం రె‘ఢీ’
X
తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన రాజన్న కూతురు వైఎస్ షర్మిల సైతం ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్, ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డిలు పాదయాత్రలు ప్రకటించగా.. ఇప్పుడు అదే కోవలో షర్మిల సైతం మరో పాదయాత్రతో తెలంగాణ జిల్లాల్లో తిరిగేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది.

ఇప్పటికే వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ జగన్ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఆ తర్వాత 2014లో ఏపీలో చురుకుగా మారి తెలంగాణలో వదిలేశారు. ఇప్పుడు ఆయన చెల్లెలు షర్మిల తెలంగాణలో సీరియస్ గా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు ఇదే దారిలో నడిచి సీఎం అయ్యారు. 2019కు ముందు జగన్ కూడా పాదయాత్ర చేసి ఏపీ సీఎం అయ్యారు.

ఇప్పుడు తెలంగాణలో ఆ పాదయాత్రల సీజన్ మొదలైంది. ఇప్పటికే హుజూరాబాద్ లో గెలుపు కోసం ఈటల రాజేందర్ దీన్ని షురూ చేశాడు. ఈనెల 24 నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయత్ర చేయబోతున్నారు. నెలరోజుల క్రితం వైఎస్ఆర్ టీపీ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతోంది. 2021 అక్టోబర్ 18వ తేదీ నుంచి ఆమె పాదయాత్ర చేపట్టబోతున్నారని సమాచారం.

ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామని.. రాజన్న రాజ్యం తిరిగి తెలంగాణలో తీసుకొస్తామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

అక్టోబర్ 18 నుంచి ప్రారంభించబోయే సుదీర్ఘ యాత్రలో అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తారనేది వివరించనున్నారు. ప్రజలకు చేరువై అధికారమే ధ్యేయంగా ఈ పాదయాత్రకు పూనుకుంటున్నారు.

2021 అక్టోబర్ 18న చేవేళ్ల నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం.