Begin typing your search above and press return to search.

ష‌ర్మిల స‌భ‌కు వెయ్యి మందే.. అంచ‌నాలు త‌ల‌కింద‌లు

By:  Tupaki Desk   |   9 April 2021 9:14 AM GMT
ష‌ర్మిల స‌భ‌కు వెయ్యి మందే.. అంచ‌నాలు త‌ల‌కింద‌లు
X
తెలంగాణ‌లో రాజ‌కీయ వేదిక ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి త‌న‌య‌.. ష‌ర్మిల త‌న పార్టీ పేరును వెల్ల‌డించేందుకు ఏర్పాటు చేసిన సంక‌ల్ప స‌భ‌కు సంబంధించి ముందున్న అంచ‌నాలు.. ఒక్కొక్క‌టిగా సడ‌లుతున్నాయి. వైఎస్‌ సంక్షేమ రాజ్యమే స్థాపనే లక్ష్యంగా తాను రాజకీయపార్టీని పెట్టబోతున్నట్టు ప్రకటించిన‌ షర్మిల ఖమ్మం వేదికగా తన పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటించబోతున్నారు. ఖమ్మంలోని పెవిలియన్‌గ్రౌండ్‌ వేదికగా జరగనున్న ‌షర్మిల సంకల్ప సభకు సంబంధించిన ఏర్పాట్లు ఆదిలో అనుకున్న విధంగా మాత్రం సాగ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఆదిలో ఏకంగా ల‌క్ష మందితో ఈ స‌భ నిర్వ‌హించి.. తెలంగాణ స‌మాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల‌ని అనుకు న్నారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల‌కు అవ‌కాశం లేద‌న్న విమ‌ర్శ‌ల‌కు తెర‌దించాల‌ని కూడా భావించారు. ఈ క్ర‌మంలోనే ల‌క్ష మంది స‌మీక‌రించే బాధ్య‌త‌ను కొంద‌రికి అప్ప‌గించారు. అయితే.. పార్టీ విధివిధానాలు తెలియ‌క‌పోవ‌డంతో పాటు.. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యం ఏమీ లేని కుటుంబం నుంచి రావ‌డం.. పైగా తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన కుటుంబంగా వైఎస్ కుటుంబం పై ముద్ర ప‌డిన నేప‌థ్యంలో మేధావులు ఈ స‌భ‌కు దూర‌మ‌వుత‌న్నారు. ఇక‌, సామాన్య జ‌నాలు వ‌చ్చే విష‌యంలోనూ అంచ‌నాలు మారుతున్నాయి.

ల‌క్ష‌మందికి ప‌ర్మిష‌న్ కోరినా.. పోలీసులు నిరాక‌రించారు. కొవిడ నిబంధనల మేరకు 5 వేల నుంచి 6 మందితో మాత్రమే సభ నిర్వహించుకోవాలంటూ పోలీసులు స్ప‌ష్టం చేసేశారు. దీంతో ఆ మేర‌కు మాత్ర‌మే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక‌, ఇప్పుడున్న ప‌రిస్థితిలో వెయ్యి మంది వ‌చ్చినా గ‌గ‌న‌మే అన్న‌ట్టుగా భావిస్తున్నారు పార్టీ అభిమానులు, వైఎస్ అభిమానులు. క‌రోనా విజృంభ‌ణ‌తోపాటు.. ఎండ‌లు ముదిరిపోవ‌డంతో జ‌నాలు వ‌చ్చేందుకు వెనుక‌డుగు వేస్తున్నారు. పైగా ష‌ర్మిల‌పై కేసీఆర్‌కు ఉన్నంత ఇమేజ్‌లో స‌గం కూడా లేక‌పోవ‌డం.. ఆమెను న‌మ్మే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో స‌భ‌కు హాజ‌ర‌య్యే వారి సంఖ్యపై ష‌ర్మిల అభిమానులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రి ఎంత మంది హాజ‌ర‌వుతారో.. ఈ స‌భ ఏమేరకు స‌క్సెస్ అవుతుందో చూడాలి.