Begin typing your search above and press return to search.

ఎంపీ అరవింద్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   26 March 2021 1:30 PM GMT
ఎంపీ అరవింద్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ బయలు దేరిన వైఎస్ షర్మిల స్పీడు పెంచారు. తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ కాకరేపుతున్నారు. తాజాగా నిజామాబాద్ , ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల భేటి అయ్యారు.

శుక్రవారం లోటస్ పాండ్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ షర్మిల నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.'నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని ఎవరో బాండ్ పేపర్ ఇచ్చారంట.. బాండ్ పేపర్ ఇచ్చి రైతులను దగా చేశారట..' అంటూ ఎంపీ అరవింద్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తెలియదా అని నిజామాబాద్ ఎంపీని వైఎస్ షర్మిల నిలదీశారు. పసుపు రైతుల కష్టాలు వర్ణనాతీతం అని.. ఎక్స్ టెన్షన్ సెంటర్ ఇస్తే పసుపు రైతుల కష్టాలు తీరుతాయా? ప్రతి గడపకు పూసే పసుపు పండించే రైతు కష్టాలు కనపడటం లేదా? భైంసాలో మతకల్లోలాలు సృష్టించడంపై ఉన్న ఆసక్తి కష్టాలపై ఉండటం లేదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

ఆదిలాబాద్ జిల్లా అభిమానులతో మాట్లాడుతూ షర్మిల ప్రొఫెసర్ కోదండరాం పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండరాం పుట్టినగడ్డ ఆదిలాబాద్ అంటూ షర్మిల తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.