Begin typing your search above and press return to search.

అనారోగ్యంతో రెస్టు తీసుకుంటున్న కేసీఆర్ ను అన్ని మాటలు అనటమా షర్మిల?

By:  Tupaki Desk   |   13 March 2022 6:30 AM GMT
అనారోగ్యంతో రెస్టు తీసుకుంటున్న కేసీఆర్ ను అన్ని మాటలు అనటమా షర్మిల?
X
ప్రతి దానికి సమయం సందర్భం చాలా అవసరం. రెండో విడత పాదయాత్రను షురూ చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడీ కీలక విషయాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ప్రజాప్రస్థానం పాదయాత్ర రెండో విడతలో బాగంగా రెండో రోజున నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని పోతినేనిపల్లె నుంచి ప్రారంభించారు. మాండ్ర గ్రామానికి చేరుకున్న ఆమె.. మాట - ముచ్చట లో భాగంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.

షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎప్పటిలానే ఘాటు విమర్శలు చేశారు.

రైతు బంధు పేరుతో రూ.5వేలు ఇస్తున్నకేసీఆర్ మరోవైపు ఎరువులు.. విత్తనాల ధరల్ని పెంచి ఆ రూ.5వేలను లాక్కుంటున్నారని ఆరోపించారు. మహిళలకు వడ్డీ లేని రుణాల్ని ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఎవరికి ఇవ్వలేదన్న ఆమె..ప్రజల సమస్యలు టీఆర్ఎస్ మంత్రులకు తెలీటం లేదంటూ దుయ్యబట్టారు.

తమ పింఛన్లు రావట్లేదని పలువురు తనకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి రోజుకో ఘాటు విమర్శలు చేస్తున్న ఆమె వైఖరి చూస్తున్నప్పుడు.. షర్మిల టైమింగ్ మిస్ అయ్యారా? అన్న బావన కలగటం ఖాయం.

ఎందుకంటే.. అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రగతిభవన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులుస్పష్టం చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తిరిగి పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల.. నిత్యం సీఎం కసీఆర్ ను తప్పు పట్టటం.. ఆయన పాలనలోని లోపాల్ని ఎత్తి చూపించటం సరిగా లేదన్న మాట వినిపిస్తోంది.

ఒకవైపు ఆరోగ్యం బాగోలేక రెస్టు తీసుకుంటున్న ముఖ్యమంత్రిపై విమర్శలు చేయటాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవటం లేదన్న మాట వినిపిస్తోంది. మరి.. తన విమర్శల తీరును షర్మిల కాస్తంత మార్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరీ.. విషయాన్ని షర్మిల గుర్తిస్తారంటారా?