Begin typing your search above and press return to search.

బ‌రిలోకి వైఎస్ ష‌ర్మిల‌!... కోట్ల కోట‌లు బ‌ద్ద‌లేనా?

By:  Tupaki Desk   |   10 March 2019 9:19 AM GMT
బ‌రిలోకి వైఎస్ ష‌ర్మిల‌!... కోట్ల కోట‌లు బ‌ద్ద‌లేనా?
X
వ‌చ్చే నెల‌లో జ‌రగ‌నున్న ఏపీ అసెంబ్లీ, సార్వ‌త్రిక ఎన్నిక‌లు... ఏపీలో ఇప్ప‌టికే పొలిటిక‌ల్ హీట్‌ ను అమాంతంగా పెంచేశాయి. ఎన్నిక‌ల దాకా ఆయా పార్టీల్లోనే ఉన్న కొంద‌రు... ఎన్నిక‌ల స‌మీకర‌ణాల నేప‌థ్యంలో అప్ప‌టిదాకా కొన‌సాగుతున్న పార్టీల‌కు షాకిస్తూ...వైరి వ‌ర్గంలో చేరిపోతున్నారు. ఇలా రాజ‌కీయ జీవితం ఆరంభించిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగిన కోట్ల సూర్యప్ర‌కాశ్ రెడ్డి.. ఇప్పుడు టీడీపీలో చేరిపోయారు. కేవ‌లం వ్య‌క్తిగ‌త స్వార్థాల‌ను చూసుకునే కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరిపోయింద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో కోట్ల‌కు త‌గిన రీతిలో బుద్ధి చెప్పాల్సిందేన‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌ట్టిగానే నిర్ణ‌యించుకున్న‌ట్లుగా ఉంది. కోట్ల‌కు ఓడించేందుకు జ‌గ‌న్ త‌న చేతిలోని బ్ర‌హ్మాస్త్రాన్ని వ‌దులుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ అస్త్రం మ‌రెవ‌రో కాదు... త‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిలే.

క‌ర్నూలు లోక్ స‌భ స్థానం నుంచి దివంగ‌త సీఎం కోట్ల విజ‌య భాస్క‌ర‌రెడ్డి చాలా సార్లు పోటీ చేశారు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం ఆయ‌న వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి కూడా ఈ స్థానం నుంచే పోటీ చేసి విజ‌యం సాధించ‌డంతో పాటు కేంద్ర కేబినెట్ లో మంత్రిగా కొన‌సాగారు. అయితే తెలుగు నేల విభ‌జ‌న ఫ‌లితం కోట్ల‌కు పెద్ద దెబ్బే కొట్టింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ క‌ర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చిన కొత్త అభ్య‌ర్థి బుట్టా రేణుక చేతిలో కోట్ల ప‌రాజ‌యం పాలయ్యారు. అయితే కాంగ్రెస్ ప‌రిస్థితి మెరుగు కాక‌పోతుందా? అంటూ వెయిట్ చేసిన కోట్ల‌... ఆ ఛాయ‌లు కనిపించ‌క‌పోవ‌డంతో ఇటీవ‌లే టీడీపీలో చేరిపోయారు. క‌ర్నూలు ఎంపీ సీటు నుంచి హామీ ల‌భించిన మీద‌టే కోట్ల టీడీపీలో చేరిన‌ట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో కోట్ల‌ను ఢీకొట్ట‌గ‌లిగే అభ్య‌ర్థి కోసం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చాలా పేర్ల‌ను ప‌రిశీలించారు. అయితే ఇటు టీడీపీ ఓట్లు, అటు కోట్ల‌కు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ ఓట్లు క‌లిస్తే... కోట్ల గ‌ట్టి అభ్యర్థి కిందే లెక్క అని ప‌క్కా గ‌ణాంకాలు తీసిన జ‌గ‌న్‌... కోట్ల‌ను ఓడించాలంటే మ‌రింత గ‌ట్టి అభ్య‌ర్థి కావాల‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టుగా స‌మాచారం.

ఈ క్ర‌మంలో ఎవ‌రో ఎందుకు? త‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌ను బ‌రిలోకి దించితే ఎలాగుంటుంద‌ని కూడా ఆయ‌న ఆలోచించార‌ట‌. ఈ ఆలోచ‌న‌కు పార్టీలోనూ మెజారిటీ నేత‌లు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో చివ‌రకు క‌ర్నూలు ఎంపీ సీటులో కోట్లు పోటీగా ష‌ర్మిల‌నే నిలిపేందుకే జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్లుగా ఇప్పుడు ఆస‌క్తిక‌ర వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌డ‌చిన ఎన్నికల్లో కోట్ల‌తో పాటు టీడీపీ అభ్య‌ర్థిని కూడా చిత్తుగా ఓడించిన జ‌గ‌న్ పార్టీ... కొత్త అభ్య‌ర్థి అయినా బుట్టా రేణుక‌ను గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా క‌ర్నూలు ప‌రిధిలో వైసీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్న నేప‌థ్యంలో... టీడీపీలో చేరిన కోట్ల గ‌తం కంటే ఎంతో కొంత ప్ర‌భావం చూపే అవ‌కాశాలున్నాయ‌ని, ఆ అవ‌కాశాల‌కు గండి కొట్టేందుకే త‌న సోద‌రిని బ‌రిలోకి దించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇదే జ‌రిగితే... ఈ ద‌ఫా కూడా కోట్ల‌కు గెలుపు అంత వీజీ కాద‌నే చెప్పాలి.