Begin typing your search above and press return to search.

వైఎస్ జయంతి రోజున పార్టీ ప్రకటనన్న షర్మిల

By:  Tupaki Desk   |   9 April 2021 5:47 PM GMT
వైఎస్ జయంతి రోజున పార్టీ ప్రకటనన్న షర్మిల
X
ఈరోజు పార్టీ ప్రకటిస్తుందని అందరూ అంచనావేసినా వైఎస్ షర్మిల మాత్రం దాటవేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజైన జూలై 8వ తేదీన పార్టీని ప్రారంభించబోతున్నట్టుగా వైఎస్ షర్మిల ప్రకటించారు. పార్టీ పెట్టాలని నిర్ణయించుకొని ఖమ్మంలో సభ పెట్టిన షర్మిల పార్టీ ప్రకటనను మాత్రం వాయిదా వేయడం విశేషంగా మారింది.

ఖమ్మంలో ప్రజా సంకల్ప సభలో కేసీఆర్ సర్కార్ షర్మిల నిప్పులు చెరిగారు. తాను తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తానని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారని, వారి ప్రాణాలు పోకుండానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుండేదని అన్నారు. తెలంగాణ సాధించుకుని ఏడేళ్లైందని.. ఇంకా బంగారు తెలంగాణ కాలేదని అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పద్దెనిమిదేళ్ల కిందట.. ఏప్రిల్ తొమ్మిదో తేదీనే తెలంగాణలోని చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారని.. ఇప్పుడు తాను రాజకీయంగా తాను కూడా తెలంగాణలో రాజకీయ అడుగుల ప్రస్థానం ప్రారంబించబోతున్నానని ప్రకటించారు. జూలై ఎనిమిదో తేదీన పార్టీ పేరు, జెండా, అజెండా అన్నీ ప్రకటించబోతున్నట్లుగా వైఎస్ అభిమానులకు షర్మిల తెలిపారు.

మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశాం.. జీతాలు పెంచమంటే.. తమ అభ్యర్థులను గెలిపిస్తేనే పీఆర్సీ అంటూ బెదిరించి ఓట్లు వేయించుకున్నారని కేసీఆర్ సర్కారుపై షర్మిల మండిపడ్డారు. హైకోర్టు లాయర్లను నడిరోడ్డుపై హత్య చేసినా.. చర్యలేవని ప్రశ్నించారు షర్మిల. వారి ప్రాణాలకు విలేవదన్నారు. పోడు భూమి కోసం పోరాడిన గిరిజనుల మహిళను బట్టలూడదీసి కొట్టినా సర్కారు స్పందించడం లేదని మండిపడ్డారు. అందుకే మన పార్టీ తెలంగాణలో అవసరమని అన్నారు.

ఉద్యమకారులను కేసీఆర్ పక్కనపెట్టారని.. ఇప్పుడు ఆయన చుట్టూ భజన బ్యాచే ఉందని షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దొరగారి(కేసీఆర్) ఎడమకాలి చెప్పుకింద నలిగిపోతోందని షర్మిల దుయ్యబట్టారు. తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నామని ప్రశ్నించారు. నీళ్లు కేసీఆర్ ఫాంహౌస్‌కు .. నిధులు కేసీఆర్ కుటుంబానికి.. నియామకాలు కేసీఆర్ ఇంటికి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రగతిభవన్ దాటడం లేదని ఆరోపించారు. అవసరం కోసం అందర్నీ వాడుకున్నారని.. పాలనకొచ్చేసరికి దొరగారి కుటుంబమే ముందుంటుందని ఆరోపించారు.