Begin typing your search above and press return to search.

వివేకా హ‌త్య‌ను లైట్ తీసుకున్నారు.. ఇక్క‌డ ఇలాంటివి `కామ‌నే` అన్నారు: సునీత క‌న్నీటి ప‌ర్యంత‌

By:  Tupaki Desk   |   15 March 2023 7:00 PM GMT
వివేకా హ‌త్య‌ను లైట్ తీసుకున్నారు.. ఇక్క‌డ ఇలాంటివి `కామ‌నే` అన్నారు: సునీత క‌న్నీటి ప‌ర్యంత‌
X
``మా నాన్న దారుణ హ‌త్య‌కు గురైన‌ప్పుడు.. నేను తీవ్ర‌షాక్‌లో కూరుకుపోయాను. ఏం జ‌రిగిందో కూడా తెలియ‌ని ఒక దిగ్భ్రాం తి స్థితిని ఎదుర్కొన్నాను. అయితే.. నా దుర‌దృష్టం ఏంటంటే.. కొంద‌రు నా మ‌న‌సును తీవ్రంగా గాయ‌ప‌రిచేలా వ్యాఖ్యానించారు. క‌ర్నూలు, క‌డ‌ప ప్రాంతాల్లో ఇవ‌న్నీ కామ‌నేన‌ని గుండెల‌పై గునపంతో గుచ్చేలా వ్యాఖ్యానించారు. అత్యంత తేలిక‌గా తీసుకున్నారు`` అని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు వివేకానంద రెడ్డి హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న మ‌న‌క్షోభ‌ను ఆయ‌న కుమార్తె డాక్ట‌ర్ వైఎస్ సునీత వెల్ల‌డించారు. ఈ స‌మ‌యంలో ఆమె కన్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

2019, మార్చి 15న వివేకా దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. పులివెందుల‌లోని ఆయ‌న స్వ‌గృహంలోనే కొంద‌రు ఆయ‌న‌ను గొడ్డ‌లితో న‌రికి చంపార‌నే వార్త‌లు తెలిసిందే. అయితే.. దీనిని నిరూపించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. కాగా, వివేకా ప్రాణాలు కోల్పోయి.. నాలుగేళ్ల‌యిన సంద‌ర్భంగా నాలుగో వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని.. పులివెందుల‌లోని ఆయ‌న స‌మాధి వ‌ద్ద వివేకా కుమార్తె సునీత నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుత‌.. త‌న తండ్రిది గుండెపోటుమ‌ర‌ణ‌మ‌ని కొంద‌రు ప్ర‌చారం చేశార‌ని అన్నారు.

అదేస‌మ‌యంలో త‌మ తండ్రిని తామే చంపించామ‌ని కూడా కొంద‌రు చెబుతున్నార‌ని.. దీని వెనుక ఏముందో తేల్చుకునేందుకు తాను న్యాయ పోరాటం చేస్తున్నాన‌ని సునీత చెప్పారు. ఈ విచార‌ణ‌లో ఏపీ ప్ర‌భుత్వం జోక్యం చేసుకుండా ఉండాల‌ని తాను అభ్య‌ర్థిస్తున్న‌ట్టు కోరారు. సొంత కుటుంబ స‌భ్యుల‌పైనే ఆరోప‌ణ‌లు చేయాల్సి వ‌స్తుంద‌ని తాను ఊహించ‌లేద‌ని..కానీ, హ‌త్య వెనుక ఎవ‌రు ఉన్నార‌నేది బ‌య‌ట‌కు రావాల్సి ఉంద‌ని.. అందుకే అన్ని విష‌యాల‌ను సీబీఐకి వివ‌రించాన‌ని చెప్పుకొచ్చారు. త‌న తండ్రిలోటు త‌న జీవితంలో తీరేది కాద‌న్న సునీత‌.. న్యాయ పోరాటంలో విజ‌యం సాధిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.