Begin typing your search above and press return to search.

వైసీపీ విజ‌యంపై!..విజ‌య‌మ్మ‌కు ఫుల్ క్లారిటీ!

By:  Tupaki Desk   |   13 Jan 2019 4:44 AM GMT
వైసీపీ విజ‌యంపై!..విజ‌య‌మ్మ‌కు ఫుల్ క్లారిటీ!
X
వైఎస్ విజ‌య‌మ్మ‌... దివంగ‌త సీఎం - మ‌హా నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమ‌ణి. భ‌ర్త బ‌తికున్నంత కాలం రాజ‌కీయాల‌కు ఆమ‌డ దూరంగానే ఉండిపోయిన విజ‌యమ్మ‌... భ‌ర్త హ‌ఠాన్మ‌ర‌ణంతో పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగ‌మింగుకుని త‌న భ‌ర్త‌ను న‌మ్ముకున్న ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచేందుకు రాజ‌కీయాల్లోకి దిగ‌క త‌ప్ప‌లేదు. అయితే భ‌ర్త లాగే త‌న కొడుకు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా మాట త‌ప్ప‌ని - మ‌డ‌మ తిప్ప‌ని నేత‌గానే ఎద‌గ‌డంతో ఊహించిన దాని కంటే ముందుగానే ఆమె మ‌ళ్లీ రాజకీయాలకు దూరంగా జ‌రిగారు. భ‌ర్త‌లోని ధీమాను కొడుకు వ్య‌వ‌హార స‌ర‌ళిలో చూసిన విజ‌యమ్మ‌... త‌న కుటుంబాన్ని న‌మ్ముకున్న వారికి ఇక దిగులు లేద‌న్న భావ‌న‌తోనే ఇప్పుడు పార్టీ వ్య‌వ‌హారాల‌ను అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కొడుకు ఆధ్వ‌ర్యంలోని వైసీపీ కొత్త పార్టీ కావ‌డంతో ఎన్నిక‌ల బ‌రిలో దిగిన విజ‌య‌మ్మ ఈ ద‌ఫా ఎన్నికల‌కు దూరంగానే ఉండేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తోంది. కొడుకు ఒక్క‌డు ఓ వైపు... మిగిలిన పార్టీల‌న్నీ మ‌రోవైపు మోహ‌రించిన కీల‌క త‌రుణంలోనూ ఏమాత్రం బెరుకు లేకుండానే ఉండిపోయిన విజ‌య‌మ్మ‌... అంద‌రూ క‌లిసినా... త‌న కొడుకు చేతిలో ప‌రాజ‌యం చ‌వి చూడ‌క త‌ప్ప‌ద‌న్న ధీమాతో ఉన్నారు.

జగ‌న్ సుదీర్ఘ పాద‌యాత్ర ముగిసిన నేప‌థ్యంలో నిన్న జ‌గ‌న్ సొంతూరు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఓ టీవీ ఛానెల్ అభ్య‌ర్థ‌న మేర‌కు విజ‌య‌మ్మ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంట‌ర్వ్యూలో చాలా అంశాల‌ను ప్ర‌స్తావించిన విజ‌య‌మ్మ‌... తన కొడుకు చేతిలోని వైసీపీ భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతోంది? త‌న కుమారుడిపై ఎవ‌రు? ఎలా కుట్ర‌లు చేస్తున్నారు? వాటిని జ‌గ‌న్ ఎలా ఎదుర్కొంటున్నారు? అస‌లు వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీ విజ‌య తీరాల‌కు చేరుతుందా? లేదా? వైరి వ‌ర్గాల నేత‌ల వ్య‌వ‌హార స‌ర‌ళి ఎలా ఉంది? వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిది? ఏపీ ఎన్నిక‌ల్లో తెలంగాణ పార్టీలు టీఆర్ ఎస్‌ - మ‌జ్లిస్ పార్టీలు రంగంలోకి దిగితే ఏం జ‌రుగుతుంది? వ‌ంటి ప‌లు కీల‌క ప్ర‌శ్న‌ల‌కు క్లిస్ట‌ర్ క్లియ‌ర్ స‌మాధానాలు ఇవ్వ‌డంతో పాటుగా వైరి వ‌ర్గాల నేత‌లు జ‌గ‌న్‌పై నిత్యం విసురుతున్న విమ‌ర్శ‌ల‌కు కూడా విజ‌య‌మ్మ చాలా సూటిగానే కాకుండా సుతిమెత్త‌గా చుర‌క‌లంటించేశారు. విజ‌య‌మ్మ చెప్పిన ఆ వివ‌రాల్లోకి వెళితే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీదే విజ‌య‌మ‌ని - సంపూర్ణ మెజారిటీతో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తార‌ని ఆమె చెప్పారు. ఇందులో త‌న‌కు గానీ - ప్ర‌జ‌ల‌కు గానీ ఎలాంటి సందేహం లేద‌ని కూడా ఆమె కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. 120 సీట్ల‌కు పైగా క్లియ‌ర్ మెజారిటీతో గెలిచే జ‌గ‌న్‌ కు ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని చెప్పిన విజ‌య‌మ్మ‌... అస‌లు పొత్తులు పెట్టుకోవాల్సిన ఖ‌ర్మ జ‌గ‌న్‌కేమీ ప‌ట్ట‌గ‌లేద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. క్లియ‌ర్‌ గా మెజారిటీ సాధించే అవ‌కాశాలున్న జ‌గ‌న్‌ కు ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మే లేద‌ని ఆమె తేల్చేశారు.

ఇక అడ‌గ‌కున్నా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన మ‌జ్లిస్‌ - టీఆర్ ఎస్ పార్టీల కామెంట్ల‌పై స్పందించిన విజ‌య‌మ్మ‌... ఆ పార్టీల నుంచి అలాంటి ప్ర‌క‌ట‌న వ‌స్తే మంచిదే కదా. ఎలాగూ జ‌గ‌న్ విజ‌యం ఖాయ‌మైపోయిన నేప‌థ్యంలో ఇలాంటి పార్టీల స‌హాయంతో వైసీపీకి మ‌రింత మంచి జ‌రుగుతుంద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. ఎన్నిక‌ల అనంత‌రం కేంద్రంలో ఏ కూట‌మితో క‌లుస్తార‌న్న ప్ర‌శ్న‌కు కూడా విజ‌య‌మ్మ చాలా క్లియ‌ర్ క‌ట్ ఆన్స‌రిచ్చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అనే సింగిల్ డిమాండ్ తో కూడిన ఎజెండాతో తాము ముందుకు సాగుతున్నామ‌ని - రేపు కేంద్రంలో ఏ పార్టీ అయితే ప్ర‌త్యేక హోదా ఇస్తామంటుందో ఆ పార్టీకే వైసీపీ మ‌ద్దతు ప‌లుకుతుంద‌ని తేల్చి పారేశారు. త‌న కుమారుడిని నేరుగా ఎదుర్కొనే ద‌మ్ము లేక‌నే... అధికార టీడీపీ - ఆ పార్టీకి అధికారం ద‌క్కేందుకు దోహ‌ద‌ప‌డిన జ‌న‌సేన‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయ‌ని ఆమె విమ‌ర్శించారు. అయినా గ‌డ‌చిన ఎన్నిక‌ల త‌ర్వాత మూడున్న‌రేళ్ల పాటు క‌లిసి మెల‌సి సాగిన టీడీపీ - జ‌న‌సేన ఇప్పుడు ఎందుకు విడిపోయాయ‌ని కూడా ఆమె ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడు విడిపోయిన‌ట్టుగా క‌నిపిస్తున్న ఆ రెండు పార్టీలు భ‌విష్య‌త్తులో తాము మ‌ళ్లీ క‌లిసేది లేద‌ని చెప్పేంత ద‌మ్ము వాటికి ఉందా? అని కూడా ఆమె ఆస‌క్తిక‌ర స‌వాల్‌ ను సంధించారు.

ఇక జ‌గ‌న్‌ పై నిత్యం త‌న‌దైన శైలిలో ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరుపైనా విజ‌య‌మ్మ మండిప‌డ్డారు. టీడీపీతో క‌లిసి ఉన్నంత కాలం ప‌వ‌న్ ఏం ఒరగ‌బెట్టార‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. ఏపీకి న్యాయం జ‌ర‌గాల‌ని త‌న కుమారుడు ఎక్క‌డ దీక్ష చేస్తే... ఆ దీక్ష దిశ‌గానే సాగిన ప‌వ‌న్ సాధించిందేమీ లేద‌ని కూడా ఆమె దెప్పిపొడిచారు. పార్ట్ టైమ్ పొలిటీషియ‌న్‌ లా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌వ‌న్‌... మొన్న‌టిదాకా టీడీపీని విమ‌ర్శించి ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో వాయిస్ త‌గ్గించార‌ని గుర్తు చేశారు. ఈ మార్పు వెనుక అస‌లు కార‌ణ‌మేంటో ప‌వ‌న్ చెప్పాల్సి ఉంద‌న్నారు. నిన్న‌టిదాకా ప‌ర‌స్ప‌రం తిట్టుకున్న ప‌వ‌న్ ను చంద్ర‌బాబు ఇప్పుడు మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌కు పిలుస్తున్న వైనాన్ని విజ‌య‌మ్మ ప్ర‌స్తావించారు. మ‌రోమారు ఈ రెండు పార్టీలు క‌ల‌వ‌వ‌ని గ్యారెంటీ ఏమిట‌ని కూడా విజ‌య‌మ్మ ప్ర‌శ్నించారు. మొత్తంగా త‌న కుమారుడు ఒక్క‌డిని చేసి మిగిలిన అన్ని పార్టీల నేత‌లు ఎవ‌రి శ‌క్తి మేర‌కు వారు కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని - అయితే ఎవ‌రెన్ని కుయుక్తులు ప‌న్నినా... జ‌గ‌న్ విజ‌యాన్ని మాత్రం ఆప‌లేర‌ని విజ‌య‌మ్మ ధీమా వ్య‌క్తం చేశారు. గ‌డ‌చిన సారి పార్టీకి త‌న అవ‌స‌రం ఉండి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాన‌ని - ఈ ద‌పా పార్టీకి త‌న అవ‌స‌రం లేదని - జ‌గ‌న్ కూడా ఈ ద‌ఫా పోటీకి త‌న‌ను పిలిచే అవ‌కాశాలు లేవ‌ని కూడా విజ‌య‌మ్మ చెప్పుకొచ్చారు. మొత్తంగా చాలా సుతిమెత్త‌గానే అయినా... విప‌క్షాల కుయుక్తుల‌న్నింటినీ క‌డిగిపారేసిన విజ‌య‌మ్మ‌... తమ పార్టీ భ‌విష్య‌త్తు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విన్నింగ్ ఛాన్సెస్‌పై చాలా క్లియ‌ర్‌ గా మాట్లాడారు.