Begin typing your search above and press return to search.

క‌దిలించేలా ఉన్న విజ‌య‌మ్మ వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   10 April 2018 9:27 AM GMT
క‌దిలించేలా ఉన్న విజ‌య‌మ్మ వ్యాఖ్య‌లు
X
దివంగ‌త మ‌హానేత వైఎస్ బ‌తికున్న కాలంలో ఇంటికి వ‌చ్చే వారిని ఆద‌రించే విష‌యంలో ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌మ్మ సాటి మ‌రెవ‌రూ రార‌ని చెబుతారు. వ‌దిన‌మ్మ‌గా అంద‌రి గౌర‌వాభిమానాలు పొందిన ఆమె.. త‌న జీవితంలో రాజ‌కీయం గురించి మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని అస్స‌లు అనుకోరేమో. అనుకోనిది జ‌ర‌గ‌ట‌మే కాల వైచిత్రి. భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత చోటు చేసుకున్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ విజ‌య‌మ్మ త‌న‌దైన మార్క్ ను మిస్ కాలేదు.

హుందాగా వ్య‌వ‌హ‌రించ‌టం.. సూటి విమ‌ర్శ‌లు చేయ‌ట‌మే త‌ప్పించి.. అన‌వ‌స‌ర‌మైన మాట ఒక్క‌టి కూడా మాట్లాడ‌ని త‌త్త్వం విజ‌య‌మ్మ‌లో క‌నిపిస్తుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం దీక్ష చేస్తున్న ఎంపీల్ని ప‌రామ‌ర్శించేందుకు ఢిల్లీ వెళ్లిన విజ‌య‌మ్మ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

మోడీ పాదాల‌కు న‌మ‌స్క‌రించి అడుగుతున్నాన‌ని వ్యాఖ్యానించిన విజ‌య‌మ్మ .. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇచ్చిన హామీలు నెర‌వేరుస్తాన‌ని చెప్పాల‌న్నారు. తాము అవిశ్వాసం పెట్టింది ప్ర‌భుత్వాన్ని దింపేద్దామ‌ని కాద‌ని.. ప్ర‌భుత్వాన్ని దింప‌లేమ‌ని త‌మ‌కు తెలుస‌న్నారు. కాకుంటే.. అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రిగితే.. రాష్ట్ర స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించొచ్చ‌న్న‌దే త‌మ ఉద్దేశంగా చెప్పారు.

దీక్ష చేస్తున్న ముగ్గురు ఎంపీలు అస్వ‌స్థ‌త‌తో ఆసుప‌త్రిలో చేరితే మూడు వికెట్లు ప‌డ్డాయ‌ని.. మ‌రో రెండు వికెట్లు ప‌డితే వెళ్లి బీజేపీతో రాజీ ప‌డ‌తారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్య‌లు స‌రికావ‌న్నారు. పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన హామీల‌కే విలువ లేక‌పోతే ఇక దేనికి విలువ ఉంటుంద‌ని ప్ర‌శ్నించిన ఆమె.. అస‌లు దేనికి క‌ట్టుబ‌డి ఉన్నారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు.

కేంద్రానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటే లెక్క‌లేనిత‌నంగా ఉందంటూ మండిప‌డిన ఆమె.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భేష‌జాల‌కు పోకుండా 25 మంది ఎంపీలు రాజీనామా చేసి హోదా సాధిద్దామ‌న్నారు. సున్నితంగా చెప్పిన‌ట్లే చెబుతూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌టంతో పాటు.. హోదా సాధ‌న‌కు ఏం చేస్తే బాగుంటుంద‌న్న విష‌యాన్ని విజ‌య‌మ్మ స్ప‌ష్టంగా చెప్పాల‌న్నారు.