Begin typing your search above and press return to search.

వైసీపీకి మదర్ స్ట్రోక్.. విజయమ్మ దూరం...?

By:  Tupaki Desk   |   28 March 2022 2:57 AM GMT
వైసీపీకి మదర్ స్ట్రోక్..  విజయమ్మ దూరం...?
X
వైసీపీలోనే వైఎస్సార్ ఉన్నారు. ఆయన ఉన్నారూ అంటే అర్ధాంగిగా విజయమ్మ కూడా ఉన్నారు. ఆమె ఉండడమేంటి కుమారుడు కాంగ్రెస్ ని వీడి బయటకు వచ్చినపుడు ఆయన ప్రతి అడుగులో తోడుగా నిలిచారు. వెన్నంటే ఉన్నారు. వైసీపీకి ఆమె గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగారు. వైసీపీకి విజయమ్మ తల్లి స్థానంలో ఉన్నారు. ఆమె ఉండడం అంటే వైసీపీకి కొండంత అండ.

అలాంటి విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. నిజానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని పరితపించారు విజయమ్మ‌. జగన్ జైలులో పదహారు నెలలు ఉన్నపుడు 2012లో ఉప ఎన్నికలు వస్తే ఆమె ఏపీ అంతా తిరిగి ప్రచారం చేసి దాదాపుగా అందరినీ గెలిపించుకున్నారు.

అంతే కాదు వైసీపీ 2019 లో అధికారంలో రావడానికి ఆమె కృషి కూడా చాలా ఉంది. గౌరవ అధ్యక్షురాలిగా ఆమె అనేక సభల్లో ప్రసంగించి వైసీపీ వైపుగా వారిని మార్చారు. అలాంటి విజయమ్మ తమ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారుట. దానికి కారణం ఆమె ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

పైగా కూతురు వైఎస్ షర్మిలతో ఉంటున్నారు. వైఎస్సార్టీపీ ని షర్మిల స్టార్ట్ చేశారు. తెలంగాణాలో ఆమె తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె పార్టీలో ఇపుడు విజయమ్మ ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతే కాదు, షర్మిల పాదయాత్రలో కూడా ఆమె ఉంటున్నారు. మరి వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటున్న విజయమ్మ వేరే పార్టీలో కీలకంగా ఉండడం మీద విమర్శలు అయితే చాలా కాలంగా ఉన్నాయి.

దాంతో తనకు తానుగానే ఆమె పార్టీకి దూరం కావాలీ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తొందరలోనే వైసీపీ ప్లీనరీ జరగబోతోంది. ఆ ప్లీనరీలో విజయమ్మ కూడా పాలుపంచుకోవాలి. అయితే తాను తప్పుకుంటాను అని విజయమ్మ అంటే ప్లీనరీ వరకూ ఉండాలని జగన్ కోరారని ప్రచారం సాగుతోంది.

ప్లీనరీ తరువాత వైసీపీని పూర్తి స్థాయిలో ప్రక్షణాల చేస్తారు. బహుశా అపుడు విజయమ్మకు గౌరవ అధ్యక్ష పదవి ఉండకపోవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2019 ఎన్నికల వేళ ఒక వైపు విజయమ్మ, మరో వైపు షర్మిల జగన్ కి తోడుగా ప్రచారం చేశారు. కానీ 2024లో మాత్రం జగన్ ఒక్కరే ప్రచార కర్తగా ఉంటారని తెలుస్తోంది.

విజయమ్మ కనుక పదవి నుంచి దూరం అయితే వైసీపీకి అది రాజకీయంగా ఇబ్బందే అంటున్నారు. అలాగే వైఎస్సార్ ముద్ర, సెంటిమెంట్ కూడా వైసీపీకి చాలా వరకూ తగ్గిపోతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.