Begin typing your search above and press return to search.

హోదా దీక్ష‌లో కూర్చున్న విజ‌య‌మ్మ‌!

By:  Tupaki Desk   |   9 April 2018 7:19 AM GMT
హోదా దీక్ష‌లో కూర్చున్న విజ‌య‌మ్మ‌!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు తెలిసిందే. గ‌డిచిన నాలుగేళ్ల‌లో ప‌లు సంద‌ర్భాల్లో హోదా వాణిని వినిపించ‌టం.. ప‌లు సంద‌ర్భాల్లో నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు.. దీక్ష‌లు చేసిన ఏపీ విప‌క్ష నేత వైఎస్ జగ‌న్మోహ‌న్ రెడ్డి.. తాజాగా త‌న ఎంపీల చేత రాజీనామా చేయించి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తార‌ని ప్ర‌క‌టించ‌టం తెలిసిందే.

దీక్ష మొద‌లైన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ముగ్గురుఎంపీలు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌టం.. వారిని బ‌ల‌వంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లించి.. వైద్యం అందించ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో దీక్ష చేస్తున్న ఎంపీల్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ తాజాగా దీక్ష చేస్తున్న ఎంపీల‌కు సంఘీభావంగా ఈ రోజు ఉద‌యం ఆమె దీక్ష‌లో కూర్చున్నారు.

నాలుగో రోజు చేరుకున్న దీక్ష‌లో ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎంపీలు ఆసుప‌త్రి పాలు కాగా.. తాజాగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో.. ఆయ‌న్ను బ‌ల‌వంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇదిలా ఉంటే.. మొక్క‌వోని దీక్ష చేస్త‌న్న ఎంపీలు అవినాశ్ రెడ్డి.. మిథున్ రెడ్డిల‌తో క‌లిసి విజ‌య‌మ్మ దీక్ష‌ను చేస్తున్నారు. విజ‌య‌మ్మ‌తోపాటు ప‌లువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు దీక్ష‌లో కూర్చున్నారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన విజ‌య‌మ్మ‌.. త‌మ శ‌క్తి మేర‌కు ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామ‌ని.. ఏపీ అధికార‌ప‌క్షం కూడా త‌మ‌తో పోరాటానికి కలిసి రావాలంటూ సూచించారు.ఏపీ అప్పుల్లో కూరుకుపోయింద‌ని.. ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఆర్థికంగా మ‌రింత భ‌రోసా ఉంటుంద‌ని.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆద‌ర‌వు అవుతుంద‌న్నారు. నాలుగేళ్ల‌లో హోదా గురించి మాట్లాడ‌ని చంద్ర‌బాబు.. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకోవ‌టం వెనుక ప్ర‌జా వ్య‌తిరేక‌తేన‌న్నారు. హోదా అంశంపై ఏపీ ప్ర‌జ‌ల్లో ఉన్న ఆకాంక్ష‌ల్ని గుర్తించి.. బాబు ఇప్పుడు నాట‌కాలు ఆడుతూ.. పుణ్యకాలం గ‌డిచిపోయిన త‌ర్వాత హోదా మీద మాట్లాడుతున్నార‌న్నారు.