Begin typing your search above and press return to search.

ఆదిలోనే అప శకునం : అమ్మ రాజీనామా ఎఫెక్ట్...?

By:  Tupaki Desk   |   8 July 2022 3:20 PM GMT
ఆదిలోనే అప శకునం :  అమ్మ రాజీనామా ఎఫెక్ట్...?
X
వైసీపీ రాజ్యాంగం ప్రకారం అయిదేళ్ళకు ఒకసారి ప్లీనరీ నిర్వహిస్తారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలా 2012లో తొలి ప్లీనరీ జరిగింది. అలా సమరోత్సాహంతో 2014లో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు అంచుల దాకా వెళ్లారు. ఇక 2017లో రెండవ ప్లీనరీని నిర్వహించి 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీని సాధించి దేశం మొత్తాన్ని ఏపీ వైపు తిప్పుకునేలా చేశారు. ఇపుడు ముచ్చటగా మూడవ ప్లీనరీ జరుగుతోంది. ఈ ప్లీనరీ టార్గెట్ కూడా 2024 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి మరోసారి కుర్చీ చేపట్టాలని.

అలాంటి ప్లీనరీ మొదలవుతూనే గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస విజయమ్మ రాజీనామా ప్రకటన చేసి క్యాడర్ ఉత్సాహంలో నిండా నీళ్ళు చల్లేశారు. ఒక వైపు ప్లీనరీకి వరుణుడు అడ్డుపడుతున్నా ఏపీవ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు. ఇక విజయమ్మ వస్తారా రారా అన్న సందేహాలు గత మూడు నెలలుగా మీడియాలో ప్రచారంలో ఉన్నవే. వాటికి మసాలా దట్టించి టీడీపీ అనుకూల మీడియా చిలవలు పలవలు అల్లిన కధలూ ఉన్నాయి.

ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అని సొంత పార్టీ వాళ్లే తేల్చుకోలేక అయోమయంలో పడిన వైనం ఉంది. అలాంటి నేపధ్యంలో ఇడుపులపాయలో జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలతో కలసి తండ్రి దివంగత నేత వైఎస్సార్ కి నివాళి అర్పించారు. దాంతో కధ సుఖాంతం అని వైసీపీ శ్రేణులు సంబరపడ్డాయి. అంతే కాదు, విజయమ్మ కూడా జగన్ తో పాటు ప్లీనరీకి రావడంతో ఇక అమ్మ మనతోనే అని కూడా ఆనందించారు.

జగన్ తో పాటు ఆమె ప్లీనరీని ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె జగన్ గురించి, వైసీపీ సర్కార్ పాలన గురించి అన్నీ మంచి మాటలే చెప్పారు కానీ చివరకు వచ్చేసరికి ఆ ఉత్సాహం అంతా కరిగిపోయేలా రాజీనామా లేఖను సంధించారు. దానికి ఆమె చెప్పిన కారణాలు ఏవైనా కూడా వైసీపీ శ్రేణులు మొత్తం షాక్ తినే పరిస్థితి అయితే ఉంది. సొంత తల్లి పార్టీకి రాజీనామా చేస్తే అందునా పార్టీ పండుగ లాంటి ప్లీనరీ మొదలైన తొలి గంటలోనే అలా లేఖను సంధిస్తే అది అప శకునంగానే అంతా చూస్తున్నారు.

రెట్టించిన ఉత్సాహంతో 2024 ఎన్నికలకు వెళ్లాలని, ఆ దిశగా దిశా నిర్దేశం చేయడానికి ప్లీనరీని నిర్వహిస్తున్నామని పదే పదే ఆ పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. కానీ జరిగింది వేరుగా ఉండడంతో అగ్ర నాయకత్వం అంతా పూర్తిగా నిరుత్సాహానికి లోను అయింది అంటున్నారు. అంతవరకూ ఎందుకు తన రాజీనామా ప్రకటన తరువాత విజయమ్మ కన్నీళ్ళు పెట్టుకున్నారు. జగన్ సైతం ఫుల్ ఎమోషన్ అయ్యారు. ఆ సీన్లు చూసిన వారికి అధికారంలో ఉన్న పార్టీ జరపక జరపక ప్లీనరీ చేసుకుంటూంటే మొదట్లోనే ఈ కన్నీళ్ళూ ఏంటి, పార్టీకే తల్లి లాంటి విజయమ్మ రాజీనామా ఏంటి అంటూ చర్చ అయితే సాగింది.

నిజానికి విజయమ్మ పార్టీ ప్రచారం చేసి కష్టాల్లో ఉన్న వైసీపీని ఎన్నో సార్లు గట్టెక్కించారు. అంతకంటే కూడా ఆమె వైఎస్సార్ సతీమణి. ఆయనలో సగభాగం. ఆమె పార్టీలో ఉంటే ఆ నిండుతనమే వేరు అన్న వారు ఉన్నారు. మరి ఇది ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం అనుకున్నా కూడా జగన్ కి వ్యక్తిగతంగా కూడా ఈ పరిణామం లోటుగానే అంతా భావిస్తున్నారు. మొత్తానికి ప్లీనరీతో సమరభేరీ మోగిస్తాం, 175 కి 175 అంటూ ఢంకా భజాయించిన వైసీపీ శ్రేణులకు ఈ పరిణామం అసలు మింగుడుపడడంలేదు అంటున్నారు.