Begin typing your search above and press return to search.

భూమా చేరికలో విజ‌య‌మ్మ పాత్ర ఏంటి?

By:  Tupaki Desk   |   21 Feb 2016 5:10 AM GMT
భూమా చేరికలో విజ‌య‌మ్మ పాత్ర ఏంటి?
X
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి - ఆయన కూతురు -ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వైసీపీ నుంచి టీడీపీలో చేరడం ఖరారైంది. త‌మ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవ‌డం ద్వారా ఏపీ సీఎం, టీడీపీ అధినేత‌ చంద్రబాబు త‌మ‌ను దెబ్బకొట్టాల‌నుకుంటున్నార‌నే విష‌యాన్ని గ్ర‌హించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ రంగంలోకి దిగారు. అంతే కాకుండా ఈ చేరిక‌ను అడ్డుకునేందుకు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, త‌న త‌ల్లి వైఎస్ విజయమ్మను సైతం జోక్యం చేసుకునేలా చేశారు. అయితే ఈ ప్ర‌య‌త్నం విఫ‌లమ‌యిన‌ట్లు స‌మాచారం.

గ‌త కొద్దిరోజులగా భూమా నాగిరెడ్డి - అఖిలప్రియాలు టీడీపీలో చేరితున్నట్లు వ‌చ్చిన వార్తలు నిజ‌మ‌ని తేలుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌హా విజ‌య‌మ్మ‌ రంగంలోకి దిగారు. భూమా నాగిరెడ్డితో ఫోన్‌ లో సంప్ర‌దించారు. "వెన్నంటి ఉన్న మీరు పార్టీని వీడితే..రాష్ట్రవ్యాప్తంగా దాని ప్రభావం పార్టీపై పడుతుంది" అని భూమాతో మాట్లాడిన స‌మ‌యంలో జ‌గ‌న్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మరోవైపు విజయమ్మ‌ కూడా నాగిరెడ్డి - అఖిలప్రియలకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీకి అండ‌గా నిల‌వాల‌ని విజ‌య‌మ్మ కోరారు. దీంతో పార్టీ మారడంపై ఒక‌ద‌శ‌లో ఆ ఇద్ద‌రు నేత‌లు విముఖత వ్యక్తం చేశారు. అంతకంటే ముందు భూమాతో మూడు గంటల పాటు చర్చలు జరిపిన ఆపార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి భూమా పార్టీ మారబోరని తెలిపారు. ఈ ఊహాగానాలన్నీ టీడీపీ మైండ్‌ గేమ్‌ లో భాగమే ఆయన అన్నారు.

అయితే జ‌గ‌న్ స‌హా విజ‌య‌మ్మ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాలని భూమా నాగిరెడ్డి స‌హా అఖిల‌ప్రియ నిర్ణ‌యం తీసుకున్నారు. భూమా చేరిక ఖ‌రారు అయిపోయిన త‌ర్వాత కూడా విజ‌య‌మ్మ‌ను వారితో మాట్లాడించ‌డం ద్వారా జ‌గ‌న్ విజ‌య‌మ్మ‌ను ఇబ్బందిపెట్టిన‌ట్ల‌యింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.