Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా మర్డర్ కేసు..సీబీఐ అదుపులో శివశంకర్ రెడ్డి !

By:  Tupaki Desk   |   17 Nov 2021 3:05 PM GMT
వైఎస్ వివేకా మర్డర్ కేసు..సీబీఐ అదుపులో శివశంకర్ రెడ్డి !
X
మాజీ మంత్రి , వైఎస్ వివేకానందారెడ్డి హత్యకేసులో అనుమానితుడు శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ రెడ్డి హైదరాబాద్ లోని ఓప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి , హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తోంది. నిందితుడు ద‌స్త‌గిరి వాంగ్మూలంలో హ‌త్య వెనుక డి.శంక‌ర్‌ రెడ్డి తో పాటు వైఎస్ కుటుంబ స‌భ్యుల పేర్లు చెప్పాడు. ఈ నేప‌థ్యంలో దేవిరెడ్డి శంక‌ర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయ‌డంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి శివశంకర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. దస్తగిరి విచారణ తర్వాత శివశంకర్‌రెడ్డి పేరు ఎక్కువగా బయటకు వచ్చింది. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల్లో శివశంకర్‌రెడ్డి పేరు కూడా ఉంది. ఇప్పటికే కడప, పులివెందులలో శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. వివేకా వద్ద డ్రైవర్ గా పని చేసిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో రాజకీయంగా కలకలం రేపింది. హత్య ఎవరు చేసారు. ఏం జరిగింది, అసలు నిందితులు ఏం చెప్పారనే అంశం గురించి దస్తగిరి పూర్తి వివరాలు చెప్పినట్లుగా సీబీఐ కోర్టులో స్టేట్ మెంట్ తో తెలిసింది. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు దస్తగిరి చెప్పినట్లు సీబీఐ స్టేట్‌ మెంట్‌ లో రికార్డు చేసినట్టు తెలుస్తోంది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే శివశంకర్ రెడ్డిని పలు మార్లు విచారించారు అధికారులు. తాజాగా మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసు విచారణ తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. హత్యకేసులు సంబందించిన కారణాలు, కుదుర్చుకున్న సుఫారీతో పాటు హత్యచేసిన వారి పేర్లు, వారికి సహకరించిన వారి వివరాలను సీబీఐ అధికారులు సేకరించిన విషయం తెలిసిందే. వివేకా హత్యకోసం రూ.40 కోట్ల సుఫారీ ఇచ్చినట్లు సీబీఐ అధికారులు తేల్చారు. స్థలం విషయంలో తలెత్తిన వివాదాల కారణంగానే వివేకాను హత్యచేసినట్లు సీబీఐ ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి చెప్పాడు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు చెప్పిన దస్తగిరి దీనికి మొత్తం మూలం బెంగళూరులోని భూవివాదమే కారణం అని తెలుస్తోంది.