Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా మృతదేహాన్ని హాల్లోకి తెచ్చిందెవరు?

By:  Tupaki Desk   |   12 Aug 2021 9:30 AM GMT
వైఎస్ వివేకా మృతదేహాన్ని హాల్లోకి తెచ్చిందెవరు?
X
ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తు అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు, విచారణ సాగిస్తున్నారు. కర్నాటక నుంచి వచ్చిన అధికారుల బృందం కూడా సోదాలు చేస్తోంది.

తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో ఓ షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. సీఎం జగన్ కు సమీప బంధువు, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డిని పులివెందుల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సుమారు రెండున్నర గంటల పాటు విచారించారు.

వైఎస్ వివేకా హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం కూడా ఘటనాస్థలిలో ఉన్నట్టు సమాచారం. బాత్ రూంలో ఉన్న వివేకా మృతదేహాన్ని హాల్ లోకి తెచ్చింది ఎవరు? వివేకా తలకు కట్టు కట్టింది ఎవరు? ఆ సమయంలో అక్కడ డాక్టర్లు ఎవరెవరు ఉన్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. ఈయన 2019లో జగన్ మామ డాక్టర్ గంగిరెడ్డి ఆస్పత్రిలో పనిచేసేవారని స్థానికులు అంటున్నారు.ఈయన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి స్వయానా పెదనాన్న అయిన వైఎస్ ప్రకాష్ రెడ్డికి పెద్ద మనవడు అంటున్నారు.

సీబీఐ అధికారుల బృందాలు పులివెందుల, ప్రొద్దుటూరు పట్టణాలు, సుంకేసుల, తేలూరుతుమ్మలపల్లె గ్రామాల్లో అనుమానితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. పులివెందులలోని సునీల్ ఇంట్లో మూడు గంటల పాటు తనిఖీలు చేశారు. బ్యాంక్ పాస్ పుస్తకం, పాతచొక్కా స్వాధీనం చేసుకున్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇంట్లోనూ సోదాలు చేసి ఇంట్లో వినియోగించే కత్తులు, బ్యాంకు పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఉమాశంకర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఇళ్లలోనూ సోదాలు చేసి కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

తనిఖీలను అనంతరం దస్తగిరి, ఎర్రగంగిరెడ్డిలను సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీబీఐ విచారణ కీలక దశకు చేరుకున్న వేళ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ అధికారులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.