Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసు తిప్పి తిప్పి... ?

By:  Tupaki Desk   |   20 Nov 2021 2:30 AM GMT
వివేకా హత్య కేసు తిప్పి తిప్పి... ?
X
వైఎస్ వివేకానందరెడ్డిని అందరూ లక్ష్మణుడు అంటారు. వైఎస్సార్ రాముడు. ఆయన మాట జవదాటని తమ్ముడు వివేకా. ఇక వివేకా రాజకీయ జీవితం అంతా అన్న వైఎస్సార్ అడుగు జాడలలోనే సాగింది. వైఎస్సార్ ఎంపీ అయినపుడు తమ్ముడు వివేకా ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఈయన ఎంపీ. మొత్తానికి చూసుకుంటే పులివెందుల రాజకీయాల్లో వివేకాదే అంతా. ఆయన మొత్తంగా పార్టీ నేతలకు ప్రజలకు ఎపుడూ అందుబాటులో ఉండేవారు. వైఎస్సార్ కూడా తమ్ముడిని అంత నమ్మేవారు. అలా వివేకా ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఇక ఆయనను అజాత శతృవు అని కూడా అంటారు ఎవరినీ నొప్పించక, తానొవ్వక మసలిన వివేకా హఠాన్మరణం అంటే నిజంగా అందరూ షాక్ అయ్యారు. మరో నాలుగు నెలల్లో ఆయన మరణించి అక్షరాలా మూడేళ్ళు నిండిపోతాయి.

ఈ రోజుకీ వివేకాను ఎవరు హత్య చేశారు అన్నది తేలడంలేదు. సీబీఐ అయితే దీని మీద విచారణ చేపట్టి వివేకా అనుచరుడు దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకరరెడ్డిని అరెస్ట్ చేసింది. ఇక దేవిరెడ్డి అయితే సీబీఐ కి లేఖ రాస్తూ ఈ హత్య వెనకన టీడీపీ వారు ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. వివేకా హత్య విషయంలో ఇప్పటిదాకా నోరు విప్పని జగన్ కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ వివేకా హత్య జరిగింది చంద్రబాబు సీఎం గా ఉండగానే, మరి వారి మీద ఎందుకు సందేహాలు ఉండకూడదు అని కొత్త పాయింట్ ని లేవదీశారు. సీఎం స్థాయిలో జగన్ ఈ విషయంలో మాట్లాడిన దానితో ఈ కేసులో మరో ట్విస్ట్ గా భావించాలి.

ఇక వివేకాను ఆయన దగ్గరి వారే హత్య చేశారని చెబుతూ టీడీపీ హాట్ హాట్ కామెంట్శ్ చేస్తూ వస్తోంది. అసెంబ్లీలో రచ్చకు కారణం అయిన బాబాయ్ గొడ్డలి పోటూ అన్న కామెంట్స్ వెనక కూడా ఇలాంటివే చాలా విషయాలు ఉన్నాయి. దీని మీద కూడా జగన్ రిప్లై ఇస్తూ ఒక కన్ను బాబాయ్, మరో కన్ను తమ్ముడు, రెండు కళ్ళూ తమకు తామే పొడుచుకోవు కదా. ఇదెక్కడి దారుణం అధ్యక్షా అంటూ పాయింట్ రైజ్ చేశారు. టీడీపీ నేతల విమర్శలు చూస్తూంటే తామే తమ సొంత చిన్నాన్నను హత్య చేశామని అంటున్నట్లుగా ఉందని కూడా జగన్ అంటున్నారు. మొత్తానికి వివేకా హత్య కేసు విషయంలో ఎన్నో మలుపులు, మాటలూ కనిపిస్తున్నాయి. జగన్ ఈ రోజు వరకూ దీని మీద ఎక్కడా మాట్లాడలేదు, ఇంత రాద్ధాంతం జరుగుతున్నా కూడా టీడీపీ మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ తొలిసారిగా ఆయన తన వేళ్లను టీడీపీ మీద చూపెట్టారు. మరి దీని మీద సీబీఐ ఏమంటుందో. విచారణలో మరెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి.