Begin typing your search above and press return to search.

వైఎస్ బ్ర‌ద‌ర్ గుస్సా - పోలీసుల‌కు ఫిర్యాదు

By:  Tupaki Desk   |   4 March 2019 8:06 AM GMT
వైఎస్ బ్ర‌ద‌ర్ గుస్సా - పోలీసుల‌కు ఫిర్యాదు
X
డేటా చౌర్యం కేసు ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హాట్ టాపిక్‌. త‌మ పార్టీ సానుభూతిప‌రుల ఓట్లు అధిక సంఖ్య‌లో తొల‌గించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌న్న కుతంత్రంతో టీడీపీయే డేటా చౌర్యానికి పాల్ప‌డింద‌ని వైసీపీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. ప్ర‌జ‌ల్లోకి ఈ కేసును తీసుకెళ్లేందుకు బ‌లంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఒత్తిడి పెంచ‌డం ద్వారా అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయాల‌ని చూస్తోంది. ఎక్క‌డెక్క‌డ త‌మ సానుభూతిప‌రుల ఓట్ల తొల‌గింపు కోసం ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయో ఆరా తీస్తోంది.

ఈ నేప‌థ్యంలో త‌న ఓటు తొల‌గింపు కోసం వ‌చ్చిన న‌కిలీ ద‌ర‌ఖాస్తుపై దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు - మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి తీవ్ర విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ ఓట్ల తొల‌గింపు ప్ర‌క్రియ భారీ యెత్తున సాగుతోంద‌ని చెప్పేందుకు త‌న ఉదంత‌మే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. త‌న ఓటు తొల‌గింపు కోసం వ‌చ్చిన న‌కిలీ ద‌ర‌ఖాస్తును ర‌ద్దు చేయాల‌ని.. ఆ ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ పోలీసుల‌కు వివేకానంద రెడ్డి సోమ‌వారం ఫిర్యాదు చేశారు.

ఏపీలో మొత్తం 50 ల‌క్ష‌ల మంది వైసీపీ సానుభూతిప‌రుల ఓట్లు తొల‌గించేందుకు టీడీపీ వ్యూహ‌ర‌చ‌న చేసింద‌ని వివేకానంద రెడ్డి ఆరోపించారు. ఓట్లు తొల‌గించ‌డ‌మంటే ప్ర‌జ‌ల హ‌క్కులు కాల‌రాయ‌డ‌మేనంటూ మండిప‌డ్డారు. ఈ వ్య‌వ‌హారంలో ఎన్నిక క‌మిష‌న్ జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. పులివెందుల నియోజకవర్గంలో చాలామంది వైసీపీ సానుభనూతిపరుల ఓట్ల తొలగింపుకు ఆన్‌లైన్‌లో భారీగా దరఖాస్తులు న‌మోదైన‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. వాటిని కొట్టివేయాల‌ని కోరారు. న‌కిలీ ద‌ర‌ఖాస్తులు పంపిన‌వారిపై కేసులు న‌మోదు చేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.