Begin typing your search above and press return to search.

వైఎస్ హ‌త్యలో కీల‌క పాత్ర అత‌డిదేనా?

By:  Tupaki Desk   |   28 Jun 2022 11:52 AM GMT
వైఎస్ హ‌త్యలో కీల‌క పాత్ర అత‌డిదేనా?
X
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసు చిక్కుముడులు ఇంకా వీడ‌టం లేదా?.. దీనికి కార‌ణం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డేన‌ని సీబీఐ అధికారులు, వైఎస్ వివేకా కుమార్తె సునీత భావిస్తున్నారా అంటే అవున‌నే అంటున్నారు. వైఎస్ వివేకా హ‌త్య ప్ర‌ణాళిక నుంచి ఆధారాలను ధ్వంసం చేయ‌డం వ‌ర‌కు దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డే కీల‌క పాత్ర పోషించాడ‌ని వైఎస్ సునీత త‌ర‌ఫున న్యాయ‌వాది పోసాని వెంక‌టేశ్వ‌ర్లు తాజాగా ఏపీ హైకోర్టులో వాద‌న‌లు వినిపించారు. వివేకా హత్యకేసులో ఏ-5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్ర‌స్తుతం క‌డ‌ప కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయ‌న సీబీఐ అధికారుల‌ను, సాక్షుల‌ను బెదిరిస్తున్నార‌ని సునీత త‌ర‌ఫు న్యాయ‌వాది తాజాగా హైకోర్టులో వాదించారు.

దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి మే 26వ తేదీన తాత్కాలిక బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఆయన ఫొటోలతో పులివెందుల మొత్తం భారీ ఫ్లెక్సీల‌తో నిండిపోయింద‌ని గుర్తు చేస్తున్నారు. ఇది ఒకరకంగా సాక్షులను ప్రభావితం చేయడమేననే సీబీఐ భావిస్తోంద‌ని చెప్పుకుంటున్నారు. వివేకా హత్య జరిగినరోజు పనిమనిషిని పిలిపించి నేల‌పై, మంచంపై ప‌డ్డ‌ రక్తాన్ని శుభ్రం చేయించడంతోపాటు శరీరంపై గాయాలు కనపడకుండా కాంపౌండర్ ను పిలిపించి కుట్లు వేయించింది దేవిరెడ్డేన‌ని ప్రధాన మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అలాగే వివేకా గుండెపోటుతో మృతిచెందార‌ని మీడియాకు వెల్ల‌డించేలా చేసింది కూడా ఆయ‌నేన‌ని అప్ప‌ట్లో వార‌త్లు వ‌చ్చాయి. దీనిపై కేసు నమోదు చేయకుండా పోలీసులపై తీవ్ర‌ ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని చెప్పుకుంటున్నారు.

కాగా మే 26న దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి తాత్కాలిక బెయిల్ పై బయటకు వచ్చినప్పుడు రాజకీయ నాయకులతోపాటు ఒక ఇన్ స్పెక్టర్ కూడా ఆయన్ను కలిశార‌ని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నాలుగు రోజులకే సీబీఐకి అప్రూవర్ గా మారిన దస్తగిరిపై పోలీసులు కేసు నమోదు చేశార‌ని అంటున్నారు. ఇవన్నీ దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి ప్రోద్భలంతోనే జరుగుతున్నాయని సీబీఐ తన నివేదికలో కూడా పొందుపరిచిందని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో సీబీఐతోపాటు వైఎస్ సునీత కూడా దేవిరెడ్డికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్ద‌ని తాజాగా హైకోర్టులో వాద‌నలు వినిపించార‌ని చెబుతున్నారు. అలాగే ఫిజియో థెరపీ చేయించుకోవాలనే పేరుతో అప్పుడ‌ప్పుడు బయటకు వస్తూ దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారనేది సీబీఐ ప్రధాన ఆరోపణగా ఉంద‌ని అంటున్నారు.

ఇలా దేవిరెడ్డి బయటకు వచ్చినప్పుడ‌ల్లా సాక్షులను కలవడం, వారిని బెదిరించి అనుకూలంగా మార్చుకోవడం చేస్తున్నార‌ని చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న తమనే బెదిరించారంటే సాక్షులను బెదిరించడం దేవిరెడ్డికి అసాధ్యమేమీ కాదనేది సీబీఐ అధికారులు కూడా భావిస్తున్నార‌ని పేర్కొంటున్నారు.