Begin typing your search above and press return to search.

ఆ 27 మంది ఏం పాపం చేసినట్లు... అందరికీ అవే కండిషన్లు...

By:  Tupaki Desk   |   29 Sep 2022 6:29 PM GMT
ఆ 27 మంది ఏం పాపం చేసినట్లు... అందరికీ అవే కండిషన్లు...
X
వైసీపీ ఎమ్మెల్యేలది వింత పరిస్థితి అనే అంటున్నారు. వారిని గడపగడపకూ తిరగమని అధినాయకత్వం చెబుతోంది. పైగా అక్కడ వారు తమ గురించి స్పెషల్ గా చెప్పేది ఏమీ ఉండదు, జనాలు తమకు ఏది చెప్పినా విని ఊరుకోవడమే తప్ప వారుగా నిధులు ఖర్చు చేసి పనులు చేసేదీ ఏమీ ఉండదు. జస్ట్ ప్రభుత్వం మూడేళ్ళ కాలంలో చేసిన కార్యక్రమాలు ఇచ్చిన హామీల మీద రెడీ చేసి పెట్టిన కరపత్రాన్ని ఇంటింటికీ తిరిగి పంచి రావడమే తప్ప వేరేగా వారు చేసేది చేయాల్సింది కూడా అసలు ఏమీ లేదు.

ఇలా గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమం గత ఆరు నెలలుగా ఏపీలో ప్రతీ చోటా ఒక మొక్కుబడి తంతుగా సాగుతోంది. ఎమ్మెల్యేలు వెళ్ళి జగన్ సర్కార్ చేసింది అని చెబుతున్నదే తప్ప తాము తన నియోజకవర్గం పరిధిలో ఫలానా పని చేశామని గట్టిగా గర్వంగా చెప్పుకునే సీన్ అయిఏ ఏ ఎమ్మెల్యేకు లేదనే అంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు చేయడానికి కూడా అక్కడ ఏమీ లేదు. వారికి నియోజకవర్గానికి నిధులు కూడా ఇవ్వడంలేదు అంటున్నారు.

ఆ మాత్రం దానికి ఒకరు బాగా చేశారని, మరొకరు చేయలేదని ఏ లెక్కన ఏ ప్రాతిపదికన చెబుతారు అన్నదే చాలా మంది ఎమ్మెల్యేలకు అర్ధం కాని విషయం అంటున్నారు. ఇక జగన్ బొమ్మతో ముద్రించిన కరపత్రాలు ఎమ్మెల్యేలు వెళ్ళి ఇవ్వడం వల్ల నగదు బదిలీ పధకాలకు బటన్ నొక్కి పంపిణీ చేసే జగన్ కే పేరు వస్తుంది తప్ప ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా వచ్చేదీ ఉండదు, వారి ఇమేజ్ అమాంతం పెరిగేది కూడా ఉండదు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఇలా ఇల్లిల్లూ తిరిగినా కూడా వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ ఇస్తారన్న కచ్చితమైన నమ్మకం కూడా లేదని చాలా మంది ఎమ్మెల్యేలు వాపోతున్న పరిస్థితి. ఇదీ గడప గడపకు మన సర్కార్ వెనక అసలైన సీన్ గా ఉంది అంటున్నారు. అయితే వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో 27 మంది ఎమ్మెల్యేలు అసలు తిరగడం లేదని, వారి పనితీరు పెద్దగా బాలేదని జగన్ వర్క్ షాప్ లో ఆక్షేపించినట్లుగా వార్తలు వచ్చాయి.

నిజానికి అలా పనిచేయని వారు అయినా గడప గడపకూ తిరిగి కరపత్రాలు పంపిణీ చేసిన వారు అయినా పెద్దగా తేడా ఏముంది అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఎవరు వెళ్లినా మానినా జగన్ పధకాల గురించే కదా చెప్పాల్సింది. ప్రత్యేకించి ఎమ్మెల్యేలు తాము చేసినది చేయబోయేది ఎక్కడా చెప్పుకునే వీలు కూడా లేదు, అలాంటి పనులు కూడా ఎక్కడా మూడేళ్లలో జరగలేదు అని అంటున్నారు.

తీరా ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్తే అక్కడ జనాలు నిలదీస్తున్నారు. వారు అనేక రకాలైన సమస్యలు చెబుతున్నారు. పోనీ వాటిని అయినా పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు చెప్పి అధినాయకత్వం వద్దకు వచ్చి నిధులు తెచ్చుకునే అవకాశం ఉందా అంటే అదీ లేదనే అంటున్నారు. అంటే ఇలా కరపత్రాలు పంపిణీ చేస్తేనే ఇమేజ్ పెరిగి ఎమ్మెల్యేలు మళ్ళీ మళ్లీ గెలిచేస్తారా అన్న చర్చ కూడా సాగుతోందిట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.