Begin typing your search above and press return to search.

కింద పడిన ప్రిన్సిపల్ కళ్ళజోడును వంగి మరీ తీసిచ్చిన జగన్..

By:  Tupaki Desk   |   6 Sep 2022 6:36 AM GMT
కింద పడిన ప్రిన్సిపల్ కళ్ళజోడును వంగి మరీ తీసిచ్చిన జగన్..
X
కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మరికొన్ని సందర్భాల్లో అందుకు భిన్నమైన తీరును ప్రదర్శిస్తూ అందరిని విస్మయానికి గురి చేస్తుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చోటు చేసుకుందని చెప్పాలి.

ఏపీ అధికార పక్షానికి.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు మధ్య నడుస్తున్న లడాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన తీసుకొచ్చిన ఈ డిజిటల్ అటెండెన్సు విషయంలో ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

తమ విషయంలో ముఖ్యమంత్రి గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే.. దీనికి భిన్నంగా తాజాగా జరిగిన ఘటన ఆసక్తికరంగానే కాదు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలోని మరో కోణాన్ని బయటకు తీసిందని చెప్పాలి.

విజయవాడలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారికి ముఖ్యమంత్రి జగన్ అవార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా అవార్డును అందుకుంటున్న బాపట్ల జిల్లా చీరాల రూరల్ మండటం ఈపురుపాలెం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న మొలబంటి వెంకటేశ్వర్లు జేబులో పెట్టుకున్న కళ్లజోడు కిందకు పడిపోయింది.

ఈ విషయాన్ని గుర్తించిన జగన్ అస్సలు ఆలస్యం చేయకుండా.. ఎలాంటి భేషజాలకు పోకుండా కిందకు వంగి.. కళ్లజోడును తన చేత్తో పైకి తీసి.. ఆ ప్రిన్సిపల్ జేబులో పెట్టిన అరుదైన ఉదంతం చోటు చేసుకుంది. గురువుల విషయంలో తనకున్న వినయం ఏపాటిదన్న విషయాన్ని ఈ ఉదంతంలో సీఎం జగన్ చెప్పకనే చెప్పారని చెబుతున్నారు. ఈ ఉదంతంపై అక్కడి వారిని ఆకట్టుకోవటమే కాదు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.