Begin typing your search above and press return to search.

షాక్: వైఎస్ వివేకానంద క‌న్నుమూత‌

By:  Tupaki Desk   |   15 March 2019 3:17 AM GMT
షాక్:  వైఎస్ వివేకానంద క‌న్నుమూత‌
X
దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి కుటుంబంలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ఈ తెల్ల‌వారుజామున (శుక్ర‌వారం) వైఎస్ సోద‌రుడు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి (68) క‌న్నుమూశారు. గుండెపోటుతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు భార్య సౌభాగ్య‌.. కుమార్తె ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వివేకానంద‌కు మొద‌ట్నించి సౌమ్యుడిగా పేరుంది.

త‌న‌కు సాయం చేయాల‌ని అడిగిన వారు ఎవ‌రైనా స‌రే.. వారి కోసం ఎంత‌వ‌ర‌కైనా వెళ్లే వ్య‌క్తిగా పేరుంది. రాజ‌కీయాల్లో అజాత శ‌త్రువుగా పేరున్న ఆయ‌న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి కుడిభుజంగా వ్య‌వ‌హ‌రించేవారు. పులివెందుల‌లో ఉన్న ఆయ‌న‌.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా... ఎంపీగా.. ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగా ప‌ని చేశారు.

1950 ఆగ‌స్టు 8న పులివెందుల‌లో జ‌న్మించిన ఆయ‌న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి చిన్న త‌మ్ముడు. తిరుప‌తి ఎస్వీ ఆగ్రికల్చ‌ర‌ల్ వ‌ర్సిటీలో డిగ్రీ చేసిన ఆయ‌న 1989.. 1994ల‌లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1999.. 2004ల‌లో ఎంపీగా ఎన్నిక‌య్యారు. 2009లో ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. వైఎస్ వివేకానంద హ‌ఠాన్మ‌ర‌ణంతో క‌డ‌ప జిల్లాతోపాటు.. వైఎస్సార్ కుటుంబ అభిమానుల్లో విషాదం నెల‌కొంది. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఊహించ‌ని రీతిలో వివేక క‌న్నుమూత వైఎస్ అభిమానుల్ని క‌న్నీరు పెట్టిస్తోంది.