Begin typing your search above and press return to search.

స్పీకరును ఇరుకున పెట్టిన మంత్రిగారు!

By:  Tupaki Desk   |   9 Nov 2017 5:24 PM GMT
స్పీకరును ఇరుకున పెట్టిన మంత్రిగారు!
X
వెనకటికి ఎవడో ‘లేస్తే మనిషిని కాదు’ అని బెదిరించాట్ట. ఈ మంత్రిగారి వైనం కూడా అలాగే కనిపిస్తోంది. వైకాపా తరఫున గెలిచి తర్వాత తెలుగుదేశంలోకి ఫిరాయించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి.. తాజాగా ఒక సవాలు విసురుతున్నారు. తాను తెదేపాలో చేరేముందు సమర్పించిన రాజీనామా లేఖను స్పీకరు ఆమోదిస్తే గనుక.. వచ్చే ఉప ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సవాలు విసురుతున్నారు. గతంలో కంటె ఈసారి అయిదురెట్ల మెజారిటీ ఎక్కువగా సాధిస్తానని ఆయన ప్రగల్భాలు పలుకుతున్నారని జనం భావిస్తున్నారు. అయిన కూడా ఇది కూడా ఒక సవాలేనా ఏమిటి? రాజీనామాను ఆమోదించడం అంటూ జరిగితే.. ఎవరైనా గత్యంతరం లేక ఉప ఎన్నికలో పోటీచేయాల్సిందే.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

జగన్ పార్టీనుంచి తనను దుమ్మెత్తిపోస్తున్నారు గనుక.. కడప జిల్లాకు చెందిన ఈ మంత్రి ఏదో మాటవరసకు డైలాగు అన్నట్లున్నది గానీ.. తన రాజీనామా ఆమోదిస్తే ఎన్నికలకు సిద్ధం అనే డైలాగు ద్వారా ఆయన ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును ఇరుకున పెట్టారని అందరూ భావిస్తున్నారు.

వైకాపా నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదనే విషయంలో ఆ పార్టీ స్పీకరు కోడెల శివప్రసాద్ వైఖరిని పలుమార్లు ఖండించారు. తాజాగా వంతల రాజేశ్వరి ఫిరాయింపు తర్వాత కూడా స్పీకరును కలిసి ఫిర్యాదుచేసి.. ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనికి జవాబుగా.. వైకాపా వాళ్లు ఫిరాయింపుల నా నిర్ణయం వచ్చే దాక ఆగకుండా, కోర్టుకు వెళ్లిన తర్వాత.. మళ్లీ నా మీద నిందలు వేస్తారేమిటి.. అంటూ కోడెల రిటార్టు ఇచ్చారు.

కాకపోతే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి మాటలతో కోడెల ఇరుకున పడ్డట్లు కనిపిస్తోంది. ఫిరాయింపులపై నిర్ణయానికి కోర్టు కేసు అడ్డు అని ఆయన అన్నారు సరే.. మరి ఆదినారాయణ రెడ్డి తాను రాజీనామా చేసానని చెప్తోంటే.. దాని మీద చర్య తీసుకోడానికి అడ్డేమిటి? ఈ ప్రశ్న ఎవరికైనా స్ఫురిస్తుంది. అడ్డగోలుగా..వైకాపాదే పాపం అన్నట్లుగా చెప్పేసిన కోడెల శివప్రసాద్.. రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకోకపోవడానికి ఎవరి మీద నిందలేస్తారో చూడాలి మరి అని జనం అనుకుంటున్నారు.