Begin typing your search above and press return to search.

బాబు క‌ల కంటే..బొత్స షాక్ ఇచ్చారు!

By:  Tupaki Desk   |   1 March 2017 5:07 AM GMT
బాబు క‌ల కంటే..బొత్స షాక్ ఇచ్చారు!
X

ఇటీవ‌లి రాజ‌కీయాల్లో కాస్త హ‌వా త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తున్న మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ అదేమీ లేద‌ని తాను త‌లుచుకుంటే సీన్ మారిపోతుంద‌ని మ‌రోమారు చాటుకున్నారు. ఏకంగా ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అదే స‌మ‌యంలో పొరుగు జిల్లాలో కూడా త‌న‌కు ఎంత ప‌ట్టు ఉందో చాటుకున్నారు. ఇదంతా శ్రీ‌కాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక గురించి. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును ఏక‌గ్రీవంగా ఎమ్మెల్సీగా నెగ్గిలేక‌పోయిన ఎపిసోడ్ గురించి. అదే స‌మ‌యంలో జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రి పరిటాల సునీత - ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు - ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కు సైతం బొత్స షాక్ ఇచ్చిన ఎపిసోడ్ గురించి.

మాజీ మంత్రి శ‌త్రుచ‌ర్ల‌ను త‌మ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన తెలుగుదేశం పార్టీ జిల్లా ఇంచార్జీ మంత్రి స‌హా ప‌లువురి స‌మ‌క్షంలోనే ఆయన ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేయాల‌ని త‌లిచింది. ఏకగ్రీవంగా శత్రుచర్ల ఎమ్మెల్సీగా ప్రకటించేలా ఇన్‌ ఛార్జి మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలంతా కృషి చేసినప్పటికీ, పొరుగు జిల్లాకు చెందిన బొత్స‌ ‘కాపు’కాసి అత్యవసరంగా శత్రుచర్లపై పోటీగా కాపు సామాజికవర్గానికి చెందిన, త‌న‌ బంధువు మామిడి శ్రీకాంత్‌ తో నామినేషన్ దాఖలు చేయించినట్టు సమాచారం. అంతకుముందు రెబల్ అభ్యర్థిగా కోళ్ళ అప్పలనాయుడుతో కాపు సామాజికవర్గానికి అన్యాయం జరిగిందంటూ బొత్స ఉసిగొలిపి నామినేషన్ దాఖలు చేసేలా పావులు కదిపినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేరుగా రంగంలోకి దిగడంతో అది నిలిచిపోయింది. డీసీసీ చైర్మన్‌ గా కాపు సామాజికవర్గం తరుఫున కోళ్ళ అప్పలనాయుడుకే ఇస్తామంటూ భరోసా ఇచ్చి, రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కాకుండా చేసారు. కేవలం ఏకగ్రీవం అయ్యేలా టీడీపీ వేసిన అడుగులు...బొత్స అడ్డుకోవడంతో తప్పనిసరిగా పోటీ ఏర్పడింది.

నామినేషన్ ఘట్టానికి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలతో సమయం పూర్తయ్యేసరికి మరో ఇద్దరు ఇండిపెండెంట్లుగా మామిడి శ్రీకాంత్ - కంచిలి పిఎసిఎస్ అధ్యక్షుడు తమరాల శోభనబాబు నామినేషన్లు దాఖలు చేసారు. దీంతో శత్రుచర్ల అనుచరులు ఆశించినట్టుగా ఏకగ్రీవం జరగలేదు. త‌ద్వారా అధికారానికి దూర‌మై మూడేళ్లు అవుతున్నా అది కూడా పొరుగు జిల్లాలో ఉన్న‌ప్ప‌టికీ త‌న స‌త్తా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని స‌త్తిబాబు నిరూపించుకున్న‌ట్లు అయింద‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/